కలం, తెలంగాణ బ్యూరో: ‘‘కేసీఆర్ (KCR) సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో… చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన.. పేగులు తెగేదాక కొట్లాడిన…’’ ఇవన్నీ కేసీఆర్ తరచూ చెప్పే మాటలు. బీఆర్ఎస్ నేతలు ఆయనను ‘తెలంగాణ జాతిపిత’ అని గర్వంగా చెప్పుకుంటారు. ‘‘కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్..’’ అని వేదిక ఏదైనా గొప్పగా ప్రకటిస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) అధికారికంగా కేసీఆర్ నిర్వహించేవారు. జాతీయ జెండాను ఎగురవేసేవారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించేవారు. కానీ, ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి షిఫ్ట్ అయ్యారో.. అప్పటి నుంచి ఆయన తీరు మారింది. ఉద్యమ సారథిగా చెప్పుకునే కేసీఆర్.. స్టేట్ ఫార్మేషన్ డే నాడు జాతీయపతాకాన్ని ఆవిష్కరించడమే బంద్ పెట్టారు. అమరవీరులకు నివాళులర్పించడమూ మానేశారు. మూడేండ్లుగా ఇదే తీరు!!
ఫామ్ హౌస్‌కే పరిమితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12ఏండ్లు పూర్తయి పదమూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వేడుకలు జరిగాయి. అన్ని పార్టీల నేతలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కొందరు ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తే.. మరికొందరు తమ ఆఫీసుల ముందు జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకున్నారు. కానీ, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) మాత్రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ను వీడలేదు. వేడుకల్లో పాల్గొనలేదు. తన పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కూ రాలేదు. ఫామ్ హౌస్లోనైనా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారా అంటే బీఆర్ఎస్ నేతలకు కూడా తెలియదు. 2024, 2025లోనూ ఇదే పరిస్థితి. అధికారంలో ఉంటేనే రాష్ట్రావిర్భావ వేడుకలు.. లేకపోతే కనీసం అమరుల త్యాగాలన్నా గుర్తు చేసుకునే తీరిక కేసీఆర్‌కు లేదా? అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. అధికారం పోగానే.. అసెంబ్లీకి రావడం మానేశారని, దానికి కొనసాగింపుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ పాల్గొనడం లేదని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ మాత్రమే తెలంగాణ భవన్‌లో మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అధికారం లేకుంటే అంతేనా?
‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు.. నాకే పదవులూ అక్కర్లేదు..’’ అంటూ యూపీఏ-1 హయాంలో తన వైఖరిని స్పష్టం చేశానని కొన్ని సందర్భాల్లో స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నారు. పదవుల కంటే రాష్ట్రమే ముఖ్యమని చెప్పుకునేవారు. రాష్ట్రం ఆవిర్భవించిన రోజును (అపాయింటెడ్ డే) జరుపుకోడానికి అధికారం, ప్రతిపక్షం అనే తేడా ఉండదనేది ఆ పార్టీ నిర్ణయం. అందులో భాగంగానే కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లి జెండా ఎగురవేస్తున్నారు. కానీ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఈ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. అమరుల త్యాగంతోనే రాష్ట్రం ఏర్పడిందని, 1200 మంది చనిపోయారని పలుమార్లు అసెంబ్లీ వేదికగానే చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అమరులకు నివాళులర్పించడం లేదు..? ఆవిర్భావ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం లేదనే ప్రశ్నలకు సమాధానం కరువైంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 585 మంది అమరులను మాత్రమే ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం గుర్తించిందని, మిగిలినవారిని పట్టించుకోలేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరులను స్మరించుకోకపోవడం సరికొత్త విమర్శకు కారణమైంది. కేవలం సోషల్ మీడియా ద్వారా లేదా ప్రకటన రూపంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలకే కేసీఆర్ పరిమితమవుతున్నారు.

