చెన్నైలో అర్జున్ దుమ్మురేపాడు.. నీమాన్‌కు చెక్‌మేట్!

కలం, స్పోర్ట్స్ : భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసీ ఎట్టకేలకు బోణీ కొట్టాడు. క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ (Chennai Grand Masters 2026) లో తొలి విజయాన్ని నమోదు చేశాడు. అమెరికాకు చెందిన హాన్స్ నీమాన్‌ను 43 ఎత్తుల్లో ఓడించి సత్తా చాటాడు. మొదటి రెండు రౌండ్లలో డ్రాతో సరిపెట్టుకున్న అర్జున్.. మూడో రౌండ్‌లో దూకుడుగా ఆడాడు. మిడిల్‌గేమ్‌లో ఆధిపత్యం సాధించాడు. ప్రత్యర్థి రాజుపై వరుసగా ఒత్తిడి పెంచాడు. చివరకు 43వ ఎత్తులో హాన్స్ నీమాన్ ఓటమిని అంగీకరించాడు.

ఈ విజయంతో అర్జున్ రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఒంటరిగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న అలిరెజా ఫిరూజ్జా కంటే అర పాయింట్ వెనుక నిలిచాడు. ఫిరూజ్జా ఈ రౌండ్‌లో నిహాల్ సరిన్‌తో డ్రా చేసుకున్నాడు. నల్ల పావులతో ఆడిన ఫిరూజ్జా 53 ఎత్తుల తర్వాత మ్యాచ్‌ను సమంగా ముగించాడు. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ కూడా ఈ రౌండ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు.

తెల్ల పావులతో ఆడిన గుకేశ్.. దిమిత్రి ఆండ్రేకిన్ రక్షణను ఛేదించేందుకు ప్రయత్నించాడు. కానీ 54 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ఎం. ప్రణేశ్ కూడా డ్రాతో సరిపెట్టుకున్నాడు. నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్‌తో జరిగిన మ్యాచ్ 27 ఎత్తులకే సమంగా ముగిసింది. రూ.75 లక్షల ప్రైజ్‌మనీతో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రపంచ స్థాయి ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడుతున్నారు. ఫిడే సర్క్యూట్‌కు కీలకమైన పాయింట్లు కూడా ఇందులో లభించనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>