కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు మల్లన్నసాగర్ నిర్వాసితులు షాక్ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. “మేం ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం.. మా ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం.. మా సమస్యలకు పరిష్కారం చూపండి.. అసెంబ్లీకి వెళ్ళి మా ఇబ్బందులను చర్చించండి..” అంటూ మల్లన్నసాగర్ నిర్వాసితులు కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.
గత రెండేండ్లుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు మాత్రమే పరిమితమైన కేసీఆర్‌కు ఆయన నియోజకవర్గ ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి మల్లన్నసాగర్ (Mallanna Sagar) భూ నిర్వాసితులు లేఖలు రాశారు. పోస్టు కార్డ్ ఉద్యమం పేరుతో కేసీఆర్‌ను నిలదీసే మార్గాన్ని ఎంచుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఫామ్ హౌజ్‌ను బాధితులతో పాటు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి చర్చించి ప్రభుత్వం తరఫున తమ బాధలకు మార్గం చూపాలని లేఖల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
మల్లన్న సాగర్ Reservoir నిర్మాణం కారణంగా సుమారు వెయ్యికిపైగా కుటుంబాలు తమ విలువైన భూములు, ఇండ్లు కోల్పోయాయి. వీరంతా వేరే ప్రాంతానికి తరలించబడ్డారు. అయితే Compensation, rehabilitation లాంటివి నేటికి పరిష్కారం కాలేదు. న్యాయ విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ నిర్వాసితులు పోస్టు కార్డ్ ఉద్యమానికి తెరలేపారు. ఈ అంశంపై గులాబీ బాస్ ఏవిధంగా స్పందిస్తారు? అనేది వేచి చూడాల్సిందే.


