కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పాఠశాలలోని విద్యార్ధుల బయోమెట్రిక్ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ విషయం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. దీనితో రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆధార్ స్పెషల్ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. ఈ నెల 5 నుంచి 9 తేదీ వరకు ఈ ఆధార్ క్యాంపులు( Aadhaar camps )కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయం విభాగం విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేయాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్(Biometric Update) చేయించుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 5.94 లక్షలు మంది మాత్రమే బయో మెట్రిక్ అప్డేట్ చేయించుకున్నారని ఇంకా 10.57 లక్షల మంది బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో 15 నుండి 17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బయో మెట్రిక్ అప్డేట్ లేకపోతే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చని విద్యార్థులు తమ సమీపంలోని స్కూల్, జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు అవగాహన కల్పించి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


