Mobile Popup Ad
Mobile Popup Ad

ఏఐసీసీ చీఫ్‌గా కేసీ వేణుగోపాల్?

కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ (Congress)లో సంస్థాగత మార్పులకు హైకమాండ్ రెడీ అవుతున్నది. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడంలో భాగంగా కీలక మార్పులే జరగనున్నాయి. సెంట్రల్ ఆఫీసులో మాత్రమే కాక పలు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలోనే ప్రక్షాళన ఉండనున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏఐసీసీ (AICC) చీఫ్‌గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే వయోభారం, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయనే స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని, ఆ స్థానంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా ఉన్న కేసీ వేణుగోపాల్ (KC Venugopal) నియమితులు కావచ్చన్నది ఆ వర్గాల సమాచారం. ప్రధాన కార్యదర్శి బాధ్యతలను సచిన్ పైలట్ లేదా మీనాక్షి నటజరాన్‌ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పవచ్చని తెలిసింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోతుగా చర్చించిన తర్వాత విధాన నిర్ణయం జరగనున్నది. ఏఐసీసీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్టుల్లో ఒకదాన్ని ఉత్తర భారతానికి, మరోదాన్ని దక్షిణ భారతానికి చెందిన లీడర్లకు అప్పజెప్పాలన్నది ప్రస్తుతానికి తీసుకున్న నిర్ణయమని ఆ వర్గాలు తెలిపాయి.

యాక్టివ్ లీడర్‌షిప్‌తో బలమైన పార్టీగా… :

రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి చాలా పార్టీల ఈక్వేషన్లు మారుతాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రెండు కూటముల మధ్య పోటీ ప్రధానమవుతుందని, ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఏదో ఒక కూటమివైపు వెళ్లక తప్పదనే అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో వారు వ్యక్తం చేశారు. ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయడంలో భాగంగా నమ్మకమైన పార్టీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియ మొదలుకానున్నది. భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీలతో చర్చించి వాటిని కొలిక్కి తెచ్చి కూటమిని స్ట్రాంగ్ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వంలోనూ మార్పులు అనివార్యం కానున్నాయి. మరో రెండున్నరేళ్లలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నందున అప్పటికి కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఆమోదించే స్థాయిలో ఏఐసీసీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను ఎంపిక చేయడంపై వర్కింగ్ కమిటీ ఫోకస్ పెట్టనున్నది. వీలైనంత వరకు యాక్టివ్‌గా ఉండే యూత్ లీడర్లకు బాధ్యతలు అప్పజెప్పాలని ఆలోచిస్తున్నది.

ఎన్డీఏ కూటమికి దీటుగా ‘ఇండియా’ :

దేశవ్యాప్తంగానే బీజేపీ బలహీనపడుతున్నదనేది కాంగ్రెస్ అభిప్రాయం. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ బలం తగ్గిందని, 2029 ఎన్నికల నాటికి మరింత వీక్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా గ్రౌండ్ స్థాయిలో మాత్రం రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతున్నదని, దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆసక్తిగా ఉన్నారని విశ్వసిస్తున్నది. దేశంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితుల రీత్యా ప్రజల్లో బీజేపీ పట్ల అసంతృప్తి ఇంకా పెరుగుతుందని, సామాన్యుల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయని, పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని అనుకుంటున్నది.

వృద్ధతరం నేతల ఆలోచనల స్థానంలో ప్రస్తుతం దేశంలోని యువత, జెన్-జీ థింకింగ్‌కు అనుగుణంగా ఏఐసీసీ జాతీయ నాయకత్వంలోనూ ఆ ఆలోచనలను అందుకునేవారిని నియమించాలన్నదే ఏఐసీసీ అభిప్రాయం. వర్కింగ్ కమిటీ సమావేశాల్లో చర్చల అనంతరం నిర్ణయం జరగనున్నది. మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

Read Also:  ఎయిర్ షోలో దుర్ఘ‌ట‌న‌.. గాలిలో ఢీ కొట్టుకున్న యుద్ధ విమానాలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>