కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని నకిలీ ఉత్పత్తుల తయారీకి అడ్డాగా మారుతోంది. ఢిల్లీ (Delhi) పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఏజీఎస్ విభాగం నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ల ముసుగులో సాగుతున్న నకిలీ దందాను అధికారులు బట్టబయలు చేశారు. కరోల్ బాగ్‌లోని రేఘర్‌పురా ప్రాంతంలో ఉన్న రెండు గోదాములపై మెరుపు దాడులు నిర్వహించి ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ బ్రాండ్లకు చెందిన భారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మోతీ నగర్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న ఒక ఫ్యాక్టరీని సైతం సీజ్ చేశారు. ఈ కేంద్రంలో ప్రముఖ కంపెనీల లోగోలతో కూడిన ప్యాకేజింగ్ బాక్సులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాడుల సమయంలో నకిలీ ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తున్న ఎనిమిది యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ స్థాయిలో ఫోర్జరీ వస్తువులను ప్యాక్ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వినియోగదారులను మోసం చేస్తూ బ్రాండెడ్ కంపెనీల పేరుతో తక్కువ నాణ్యత గల పరికరాలను చలామణి చేస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న ఇతర లింకులపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

