కలం, వెబ్ డెస్క్: సింగరేణి కార్మికుల సమస్యలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. సింగరేణికి ఎక్కువ బ్లాక్ లు వచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని.. సింగరేణి కార్మికుల కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం కొట్లాడుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన “బాయిబాట” కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ RK7 మైన్ ను కవిత సందర్శించి మాట్లాడారు.
టీఆర్ఎస్ కు సింగరేణి ఆశీర్వాదం కావాలి..
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించామని అన్నారు. “బాయిబాట” ద్వారా తమ వద్దకు వచ్చామని.. టీఆర్ఎస్ కు సింగరేణి ఆశీర్వాదం కావాలని కోరారు. ఇక్కడకు వస్తుంటే తమకు మహిళ సూపర్ వైజర్లు ఎదురయ్యారని.. ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని తాము పార్లమెంట్ లో ఫైట్ చేశామని చెప్పారు. ఇవ్వాళ సింగరేణిలో మహిళ ఉద్యోగులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఇక్కడున్న మహిళ ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవని చెప్పారు. సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే మహిళ ఉద్యోగులు వస్తున్నారని.. వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందని తెలిపారు. ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తమతో పాటు పనిచేశానని అన్నారు. రకరకాల కారణాలతో కొత్తగా పార్టీ పెట్టానని.. ఇప్పుడు కూడా తమ కోసం పనిచేసేందుకు వచ్చానని అన్నారు.
సరైన భద్రత లేదు..
సింగరేణి కార్మికులకు సరైన భద్రత లేదని.. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదన్నారు. వేరే చోట అత్యాధునిక టెక్నాలజీ వాడుతుంటే ఇక్కడ మాత్రం పాత టెక్నాలజీ వాడుతున్నారని చెప్పారు. మైన్ లోకి వెళ్లే కార్మికులకు గాలి కూడా ఇవ్వటం లేదని.. గాలి, నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత సింగరేణిదేనన్నారు. ఇప్పటికీ కూడా పాత టెక్నాలజీ వాడుతున్న సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలని చెప్పారు. కనీసం సరైన మంచి నీళ్లు కూడా ఇవ్వకపోవటమనేది మానవ హక్కుల ఉల్లంఘననేనని మండిపడ్డారు. తాము మైన్ దగ్గర వెళ్తే నిన్న, ఇవ్వాళ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. “ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైన్ మీద మీటింగ్ లు పెట్టలేదా? మీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మీటింగ్ లు పెట్టలేదా? కార్మికులను కలిసి వారి బాధలు అడిగితేనే కదా వారికి బాధలు తెలిసేది? కార్మికుల బాధలను తెలుసుకోని పోరాటం చేస్తేనే కదా చట్టాలు వచ్చేది? తల్లి కాంగ్రెస్ తో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడున్న పిల్ల కాంగ్రెస్ తో కొట్లలేమా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నలంతా మా పార్టీలో ఉన్నారు..
సింగరేణిలో ప్రస్తుతం చాలా మంది యువ వయసు ఉన్న వాళ్లు పనిచేస్తున్నారని.. ఇప్పటికే ఐటీ కారణంగా రెండు నెలల జీతం పోతుందని అన్నారు. ఇంకా పిల్లలను మంచి స్కూల్లో చదివించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పిల్లల కోసం మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కావాల్సిన అవసరాలు తీర్చేందుకు డబ్బు ఉంటుందని.. కానీ కార్మికుల కోసం ఉండదా? ఇలాంటి వాటిని ప్రశ్నించేందుకే తాము వచ్చామన్నారు. గతంలో అన్నలు ఉండటంతో కార్మికుల విషయంలో ఆఫీసర్లు కొంత పద్దతిగా వ్యవహరించే వారని.. ఇప్పుడు అన్నలు పోయారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కానీ ఆ అన్నలంతా ఇప్పుడు తమ పార్టీలో ఉన్నారని.. మానవ హక్కుల ఉల్లంఘన చేస్తమంటే ఊరుకునేది లేదని చెప్పారు.
మెడికల్ బోర్డు ఎందుకు పెట్టటం లేదు?
కార్మికులను వేధించే అధికారులపై కేసులు పెడతామని కవిత హెచ్చరించారు. 40 వేల మంది కార్మికులకు 80 వేల క్వార్టర్లు ఉన్నాయని.. రెండు క్వార్టర్లకు ఒకరి చొప్పున ఇవ్వొచ్చని తెలిపారు. కానీ అలా చేయటం లేదని.. కార్మికులను అఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తున్నారని.. ఆనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను కూడా అన్ ఫిట్ చేయటం లేదన్నారు. మొన్న డిప్యూటీ సీఎం వచ్చి 350 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు కానీ, 2 వేల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. నాలుగు నెలల్లో సర్వీస్ అయిపోతున్న పెద్ద మనిషి కలిసి బాధ పడుతున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆయనను అన్ ఫిట్ చేయలేదని.. వాళ్ల పిల్లలకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు పాలసీ ఉంది కదా? నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. ఎందుకు పెట్టటం లేదు? అని నిలదీశారు.

