కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్, స్లోవేకియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, స్నేహబంధాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు స్లోవేకియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.
భారత ప్రధానికి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారమైన “ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్” (The Order of the White Double Cross) అవార్డును ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని అధికారికంగా ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, సాంస్కృతిక బంధాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చినందుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ తాజా పురస్కారంతో కలిపి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇప్పటివరకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి అందుకున్న మొత్తం సర్వోన్నత పురస్కారాల సంఖ్య 33కు చేరింది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్లోవేకియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అరుదైన గౌరవం కేవలం వ్యక్తిగతంగా తనకు దక్కినది కాదని, 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవంగా ఆయన అభివర్ణించారు. భారత్-స్లోవేకియా దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధానికి, పరస్పర గౌరవానికి ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

