కాంగ్రెస్ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోంది: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119) లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7 వేల కోట్ల రూపాయల భారీ స్కాం జరుగుతోందన్నారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఉన్నారని.. రక్షకులే భక్షకులుగా మారారని ఆరోపించారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి సీఎం వైఎస్ఆర్ 2007లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి APIICకి అప్పగించారని చెప్పారు.

భూములపై రేవంత్ కన్ను పడింది..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఈ భూములను కంటికి రెప్పలా కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్ను ఈ భూములపై పడిందన్నారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. ఈరోజు వాళ్లను భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లను, రౌడీలను పెట్టి పోలీసుల చేత దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. కౌసల్య, మమత లాంటి మహిళా రైతులు 40 ఏళ్లుగా ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నారని.. వారికి 5, 10 లక్షలు ఆశచూపి వెళ్లగొట్టాలని చూస్తున్నారని చెప్పారు. బోర్లు, కంచెలు ధ్వంసం చేశారని తెలిపారు. మహిళలను రౌడీల చేత బెదిరిస్తున్నారని.. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

ఈ భూమి ప్రభుత్వ భూమే..

ఈ నాదర్‌గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతుండగా, 2005లోనే అప్పటి ఆర్డీవో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారని హరీశ్ (Harish Rao) అన్నారు. 2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని.. కానీ 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించాడని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్డీవో తేల్చిచెప్పారని వివరించారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా.. ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్ మరియు డివిజన్ బెంచ్ (13-10-2022న) స్పష్టం చేశాయన్నారు. అమ్మినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందన్నారు.

రేవంత్ రెడ్డి రాగానే గూండాలు ఎందుకు వస్తున్నారు?

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారని.. ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద ఈ కేసు ఏప్రిల్ 7, 2026 విచారణకు పెండింగ్‌లో ఉందని చెప్పారు. సుప్రీంకోర్టులో వాళ్లకు ఎలాంటి స్టే రాలేదు, కాబట్టి హైకోర్టు తీర్పే ఫైనల్ అని తెలిపారు. సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ ఇది ప్రభుత్వ భూమి అనే స్పష్టం చేశారని వివరించారు. ఈరోజు ఉదయం భూభారతి (Bhu Bharati) వెబ్‌సైట్‌లో చూసినా ఇది ప్రభుత్వ భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్‌గానే చూపిస్తోందన్నారు. ఇంత స్పష్టంగా కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నప్పటికీ కస్టోడియన్‌గా ఉండి భూములను కాపాడాల్సిన ఆర్డీవో కళ్లు మూసుకున్నారని ఆగ్రహించారు. మార్చి 9, 10 తేదీల్లో రైతులు కందుకూరు ఆర్డీవోకు, ఎమ్మార్వోకు, రంగారెడ్డి కలెక్టర్‌కు, చివరకు హైడ్రాకు కూడా గుండాల ఆక్రమణలపై వినతిపత్రాలు ఇచ్చారని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తే.. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం గుండాలతో ఆ భూములను గుంజుకుంటోందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గూండాలు, రౌడీలు ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు వస్తున్నారు? దీని వెనుక ఉన్న దొంగలు ఎవరో స్పష్టమవుతోందంటూ చురకలు అంటించారు.

Read Also:  సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధం: కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>