Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ విద్యతో చెలగాటమాడొద్దు.. ఎస్ఎఫ్ఐ హెచ్చరిక

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వ విద్యను (Govt Education) బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు హెచ్చరించారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ చౌరస్తాలో విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్య పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, జిల్లా కార్యదర్శి భరత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను విలీనం చేసే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల మూసివేత వల్ల గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి విద్యార్థికి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, అవసరమైన విద్యా సామగ్రి అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు, లెక్చరర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత ప్రవేశాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థులకు నష్టం కలిగిస్తున్న జీఓ నెం. 7, 8, 9లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఆందోళనలు నిర్వహిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, విద్యార్థులు, వివిధ కళాశాలల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>