కలం, ఖమ్మం బ్యూరో : భారతదేశ ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) చూపిన మార్గంలో నడవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) తెలిపారు. దేశ భవిష్యత్తుకు ఆయన దిక్సూచిగా నిలిచారని భట్టి కొనియాడారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి భట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమని భట్టి కొనియాడారు. కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఈనాటికీ పాలకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. శాఖలో బాధ్యతలు చేపట్టినా.. ఆ శాఖకు సరికొత్త ఔన్నత్యాన్ని తీసుకువచ్చిన గొప్ప పరిపాలనాదక్షుడని భట్టి ప్రశంసించారు. దేశంలో సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్ రామ్ అనేక పోరాటాలు చేశారని, దేశ భవిష్యత్తుకు ఆయనో దిక్సూచిలా నిలిచారని భట్టి తెలిపారు.
అత్యంత పేదరికం, వెనుకబాటుతనం నుంచి వచ్చినప్పటికీ.. తన కృషితో దేశంలోనే అత్యున్నత స్థానాలకు ఎదిగారన్నారు. అధికారాన్ని అనుభవించడానికి కాకుండా, దేశ ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోశారని ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఒక పాఠమని, ఆయనది నిరంతరం ప్రగతిశీలమైన పంథా అని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కొనియాడారు. కాంగ్రెస్ ప్రజా రంజక పాలనకు కారణం అలాంటి మహనీయుల ఆదర్శాలే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రామదాసు నాయక్, కోరం కనకయ్య, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధం: కవిత
Follow Us On: Instagram

