Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యారంగ సమస్యలపై ‘ఎస్‌ఎఫ్‌ఐ’ సమరభేరి.. కరీంనగర్‌ కలెక్టరేట్ వద్ద ధర్నా!

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా (Karimnagar SFI) కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి సంస్థలకు అప్పగించడం వల్ల విద్యార్థులకు నాసిరకం భోజనం అందుతున్న పరిస్థితి ఉందని, ఆ కాంట్రాక్టులను రద్దు చేసి గతంలో మాదిరిగా మహిళా సంఘాలకే బాధ్యతలు అప్పగించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. చట్టం అమలు లేకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠశాలల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాయని, ఈ విధానాన్ని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 7, 8, 9లను రద్దు చేయాలని కోరారు.

ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు దానిని అమలు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే ఆ పథకాన్ని అమలు చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెళ్ళి అరవింద్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంజన , జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, ఇసాక్, సహాయ కార్యదర్శి బోగేష్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, రోహిత్ సందేశ్ నరేష్ నాయకులు సాయి మనోజ్, సింగ్, మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>