కలం, వెబ్‌డెస్క్: దేశంలో పెట్రో ధరలు పెంచడంతో కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య (Siddaramaiah) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం (Modi Govt) తమ తప్పిదాలకు ప్రజలను శిక్షిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సిద్ధ రామయ్య ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టులో తీవ్ర విమర్శలు చేశారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.3 పెంచి సామాన్యులపై మోదీ ప్రభుత్వం నేరుగా దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విదేశీ విధానం ఫెయిల్ అయ్యిందని, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటిని సక్రమంగా నిర్వహించలేక సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కష్ట కాలంలో ప్రజలను రక్షించాల్సింది పోయి వారిని కేవలం రాబడి ఇచ్చే వనరులుగానే చూస్తోందని ఆరోపించారు.
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.106, డీజిల్ ధర రూ.94 దాటిందని సిద్ధ రామయ్య వెల్లడించారు. ఈ పెంపు ప్రభావం కేవలం ఫ్యూయల్ స్టేషన్లకే పరిమితం కాదని హెచ్చరించారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసరాలు, పాలు, నిర్మాణ సామగ్రి ధరలతో పాటు స్కూల్ వ్యాన్ ఫీజులు, ఆటో, టాక్సీ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. ఇది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రజలకు ఆ ప్రయోజనాన్ని అందించకుండా భారీగా పన్నులు వసూలు చేసిన కేంద్రం ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు మాత్రం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోందని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి తన పారిశ్రామిక వేత్తలైన స్నేహితులను రక్షించడంలో ఉన్నంత శ్రద్ధ సామాన్యులపై లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని సిద్ధ రామయ్య డిమాండ్ చేశారు.

