కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అయి ఉండి 30 నెలలుగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎందుకు రివ్యూ చేయలేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. తాము వెంటబడి ధర్నాలు, ఆందోళనలు చేస్తే మొదటిసారి సమీక్ష చేపట్టారని అన్నారు. పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటున్న కేంద్ర ప్రభుత్వం… తెలంగాణలో మాత్రం ఎందుకు పరిమితులు విధిస్తోందని నిలదీశారు. దీనిపై బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు? అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో 8 మంది కాదు కదా ఒక్క ఎంపీ కూడా గెలవరు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదని.. ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.
గతంలో తుమ్మడిహట్టిని అంగీకరించని మహారాష్ట్ర సీఎం వద్దకు వెళ్లి ఏదో చేస్తున్నాననే భ్రమలు కల్పిస్తున్నారని చెప్పారు. తాను పని చేస్తున్నట్లు సీఎం నటిస్తున్నాడు కానీ.. పక్క రాష్ట్రంలో ఉన్న తన గురువైన ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రం కలవటం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడిని కలిసి 200 టీఎంసీలు తెలంగాణకు కావాలని అడగాలని చెప్పారు. బనకచర్లకు రేవంత్ రెడ్డి అంగీకరిస్తే తెలంగాణకు నీటి ద్రోహం చేసినట్లే అవుతుందని చెప్పారు.
భవిష్యత్‌లో తెలంగాణకు కృష్ణా నీళ్లు సరిపోవు కాబట్టి గోదావరిలో 200 టీఎంసీలు నీళ్లు కావాలని అడగాలన్నారు. లేదంటే తెలంగాణకు నీటి విషయంలో ద్రోహం చేసిన వాళ్లు అవుతారని హెచ్చరించారు. ఉద్యమకారులను గుర్తించే అఖిలపక్ష సమావేశానికి తమను పిలవకపోవటాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఉద్యమకారులకు కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందేనని.. దాని కోసం ఉప్పల్ భగాయత్‌లో వచ్చే నెల పోరాటం చేయబోతున్నామని ప్రకటించారు. నాదర్‌గుల్‌లో ఉన్న 200 ఎకరాల భూమిని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

