ఉచిత విద్యుత్, వైద్యం ఇవ్వకపోతే నన్ను రాళ్లతో కొట్టండి: కవిత

కలం, మెదక్ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత విద్యుత్, వైద్యం ఇవ్వకపోతే తెల్లపూర్ వద్ద తనను కట్టేసి రాళ్లతో కొట్టండని అన్నారు. సంగారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరులో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాల భూ కబ్జా చేస్తే ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు దీనిపై మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. సంగారెడ్డిలో రాజకీయం భలే ఉంటుందని.. జగ్గారెడ్డి, రఘునందన్ రావు, దామోదర రాజనర్సింహ, హరీశ్ రావు లాంటి నాయకులు వివిధ పార్టీల్లో ఉంటారు కానీ.. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

రఘునందన్ రావు నోటికి ఎందుకు తాళం పడింది?

జహీరాబాద్ లో బులెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభం చేశారు.. కానీ ప్రాజెక్టు డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి వివరణ) మార్చడంతో బులెట్ ట్రైన్ రాలేదని.. ఈ విషయంపై ఎంపీ రఘునందన్ రావు నోటికి ఎందుకు తాళం పడింది అని ప్రశ్నించారు. హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి సింగూరు ప్రాజెక్టు కుంగుతున్నా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. నీళ్ల కోసం ఆనాడు ఆంధ్రా వాళ్ళని తిట్టామని.. మరి తెలంగాణ వచ్చాక హరీశ్ రావు ఎందుకు రిపేర్ చేయలేదని కవిత (Kavitha) ప్రశ్నించారు. సింగూర్ ప్రాజెక్టు 2016-18లో మొత్తం ఎండిపోయిందని, జిల్లా మంత్రిగా అయినా రిపేర్ ఎందుకు చేయలేదన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ లేని రాజకీయాల అవసరం..

సంగారెడ్డిలో మ్యాచ్ ఫిక్సింగ్ లేని రాజకీయాల అవసరం ఉందని చెప్పారు. తాము పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతుల కల్లాల దగ్గర గుండెపోటుతో చనిపోతే అడిగే గుండె ధైర్యం ఏ పార్టీకి లేదని విమర్శించారు. వారికోసం తాము కొట్లాడుతామని.. రైతును గౌరవించే జవాబుదారీ ప్రభుత్వాన్ని నడిపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ యువతకు మొదటి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. యువత వ్యాపారం చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందిస్తామని అన్నారు. తెలంగాణ వస్తే అందరికీ రాజకీయంగా అవకాశాలు వస్తాయని అనుకున్నామని.. కానీ అలా జరగలేదని చెప్పారు. తాము మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు పెద్ద పీట వేస్తా,మని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని అన్నారు.

Read Also: తగ్గిన సాగు.. రాష్ట్రంలో కూరగాయల షార్టేజ్ ముప్పు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>