కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి హిట్లరే ఆదర్శమని చెబుతున్నారని.. హిట్లర్ కు పట్టిన గతే రేవంత్ కు పట్టడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధించడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపి వారి భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఆగం చేశారని విమర్శించారు. వడ్లు అమ్ముకోవడానికి రైతులు 45 రోజుల పాటు కల్లాల వద్ద పడిగాపులు కాశారని, నేటికీ 30% వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఎన్నికల కోసం కాకుండా రైతుల మీద ప్రేమతో కేసీఆర్ రైతుబంధు తీసుకువచ్చారని, కానీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఎగనామం పెట్టిందని ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి, బడ్జెట్‌లో చెప్పిన 35 వేల కోట్లకు గానూ సగం కూడా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మండలానికో గోదాము కట్టి ఎరువుల కొరత లేకుండా చేస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం మళ్లీ పాత రోజుల తరహాలో క్యూలైన్లు, లాఠీచార్జీల పరిస్థితి దాపురించిందన్నారు.
గత నాలుగు నెలలుగా ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్ల రాష్ట్రంలో 3 వేల మంది రైతులు చనిపోయినా రైతు బీమా రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కొత్తగా తెస్తున్న ‘రైతు డిస్కం’ జీవో నంబర్ 8 వల్ల వ్యవసాయానికి కేవలం పగటి పూట 7 నుంచి 8 గంటల పాటు మాత్రమే కరెంటు వస్తుందని, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఉరి వేయబోతున్నారని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో పెద్దపల్లి జిల్లాలో ఎకరం భూమి 50 నుంచి 60 లక్షలు ఉంటే, నేడు కాంగ్రెస్ పాలనలో సగానికి పడిపోయిందని, రైతుతో పాటు రైతుల భూముల విలువ కూడా తగ్గిపోయిందని హరీశ్ రావు గారు విమర్శించారు.
హిట్లర్ అంటే ఇష్టం, ఆయనను చూసే హైడ్రా పెట్టిన అని రేవంత్ రెడ్డి స్వయంగా అనడం ఆయన అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. నాడు హిట్లర్ పేదలను ఊచకోత కోస్తే, నేటి నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ దురాగతాలకు నేటికీ జర్మనీ క్షమాపణలు చెబుతున్నట్లే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాపాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదని హెచ్చరించారు.
భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీఏ ట్యాక్స్‌లు, మద్యం ధరలు విపరీతంగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చే పథకాలను మాత్రం ఎగ్గొట్టిందని దుయ్యబట్టారు. తులం బంగారం ఇస్తామని మోసం చేయడంతో పాటు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేసి పేదల పిల్లల చదువులను దూరం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: తగ్గిన సాగు.. రాష్ట్రంలో కూరగాయల షార్టేజ్ ముప్పు!
Follow Us On: Instagram

