కలం, కరీంనగర్ బ్యూరో: న్యాయస్థానం ఆదేశాల మేరకు పీఎంజే జ్యువెలరీ షాప్ దారి దోపిడీ కేసు (PMJ Robbery Case) దర్యాప్తులో భాగంగా ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల వరకు ఈ పోలీస్ కస్టడీ కొనసాగింది. పోలీస్ కస్టడీలో విచారించిన నిందితుల వివరాలను పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఇందులో A1గా సుబోధ్ సింగ్ ఉన్నాడు. ఈయన బీహార్ రాష్ట్రం నలందా జిల్లాలోని చిష్టిపూర్ గ్రామానికి చెందిన వాడు. ఈయన పేరు ఈశ్వరి ప్రసాద్ సింగ్‌గా పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే కేసులో A2గా ఉన్న రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్ వెస్ట్ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా వెల్లడించారు. ఈయన పశ్చిమ బర్దమాన్ జిల్లాలోని ఆసన్సోల్ సౌత్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. మరోవైపు ఈ కేసులో రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ A3గా ఉన్నారు. పోలీస్ కస్టడీ సమయంలో సాక్షుల సమక్షంలో నిందితులను సుదీర్ఘంగా విచారించారు. అలాగే కీలకమైన ఆయుధాలు, మొబైల్ ఫోన్ రికవరీ చేశారు.
ఆయుధాల స్వాధీనం
నిందితులు A2, A3లు ఇచ్చిన సమాచారం మేరకు వారిని వెంటబెట్టుకొని వెళ్లగా.. వెలిచాల బైపాస్ రోడ్ వద్ద గల చెట్ల పొదలలో దాచి ఉంచిన నేరానికి ఉపయోగించిన రెండు పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తప్పించుకుపోయిన మార్గమైన ధర్మపురి వైపు విచారణ జరపగా, మద్దునూరు గ్రామ పరిధిలోని బగ్గారం మండల అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్‌ను గుర్తించి, సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తప్పుదారి పట్టించే యత్నం
విచారణలో కొంత సమాచారం సేకరించినప్పటికీ, నిందితులు పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించలేదు. దొంగిలించిన సొత్తు ఎక్కడ దాచారు? ఎవరికి విక్రయించారు? ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? అనే కీలక సమాచారాన్ని నిందితులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. ఆభరణాల దాచివేత, రవాణా విషయాలపై నిందితులు పరస్పర విరుద్ధమైన, తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు ఇచ్చారు. ముఖ్యంగా గతంలో గుండాల అటవీ ప్రాంతంలో సొత్తు దాచినట్లు చెప్పిన A2, ఇప్పుడు ఆ సమాచారం నుండి వెనక్కి తగ్గాడు. కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడానికే నిందితులు ఇలా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో, నిందితులను మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గౌరవ న్యాయస్థానంలో ప్రత్యేకంగా రిక్విజిషన్ దాఖలు చేయనున్నారు.
పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి అరెస్ట్
ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ బృందం ఒక భారీ విజయాన్ని సాధించింది. ఈ నెల 4న బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని సలింపూర్‌లో A10 నిందితుడైన అమర్‌సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్‌ను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. నిందితుడిని అక్కడ స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరిచి, కరీంనగర్‌కు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ (Transit Warrant) పొందారు. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందం నిందితునితో కలిసి కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ కేసులోని మిగిలిన పరారీ నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు.

