కలం వెబ్ డెస్క్: ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వం వల్లనే శంకర్ గౌడ్ బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రకు తెరతీసిందని కవిత ఆరోపించారు. అందుకే కార్మికులు సమ్మె చేపట్టారని చెప్పారు. ఈ సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను చూడలేక శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. కొన ఊపిరితో కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించడానికి గురువారం అర్ధరాత్రి వెళ్తే ఆస్పత్రి లోపలికి కూడా వెళ్లనీయకుండా ఈ ప్రభుత్వం అడ్డుకున్నదని కవిత ఆరోపించారు. ఆస్పత్రి నుంచి డాక్టర్‌ను బయటికి పంపించి శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని ప్రకటన ఇప్పించారని మండిపడ్డారు.ఇక తెల్లవారే సరికి శంకర్ గౌడ్ మరణించినట్టు ప్రకటించారని, ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యేనని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా శంకర్ గౌడ్ కుటుంబసభ్యులకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని, వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు డిప్యూటీ సీఎం భట్టి ఆర్టీసీ కార్మికులతో జరిపే చర్చల్లో వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, సంస్థలో యూనియన్లను పునరుద్ధరించాలని సూచించారు.

