నిజామాబాద్ నుంచి తన ‘జాగృతి జనం బాట(Jagruthi Janam Bata)’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఆమె నిజామాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమద్యమంలో గన్‌పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పించారామే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఎవరో కనికరిస్తే వచ్చింది కాదని, ఎందరో ప్రాణాలు అర్పించి పోరాడితే వచ్చిందని పేర్కొన్నారు. ఏ ఆశయాల కోసం వారు అమరులు అయ్యారో ఆ ఆశాయలను ఇప్పుడు ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలని సూచించారు.
‘‘పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేదు. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు’’ అని అన్నారు.
‘‘ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన. అప్పుడు అమరవీరుల కుటుంబాలాకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పాను. కానీ మీకోసం నేను ఇంకా ఎక్కువగా కొట్లాడేది ఉండే అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా. తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారు’’ అని గుర్తు చేశారు.
‘‘ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా. ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దాం. ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తా’’ అని వెల్లడించారు.
‘‘33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా. మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందే. ఉద్యమకారుల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చింది. అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ సాధించుకున్నాం’’ అని అన్నారు.
‘‘కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చాలా మంది చెబుతున్నారు. అందరు బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలి. జాగృతి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోంది. వాటిని సాధించుకుంటాం. ఎస్సీలు, ఎస్టీల కోసం పోరాటం చేస్తున్నాం. మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండాలని జాగృతి ఎప్పుడో చెప్పింది. అగ్రవర్ణాల్లోని అన్ని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం లేదు. వైశ్యుల జనాభాకు అనుగుణంగా వారికి ప్రాతినిథ్యం లేదు. అగ్రవర్గాల్లోని అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు రావాలి’’ అని వ్యాఖ్యానించారు.
‘‘అందరూ బాగుంటేనే అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ ఉంటుంది. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది కోసమే సామాజిక తెలంగాణ కావాలని అంటున్నా. దానికోసమే నేను జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నా. ప్రతి జిల్లాలో మేధావులను కలుస్తాం. జిల్లాలో ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి గురించి చర్చిస్తాం. జాగృతి లో ఇదివరకు పనిచేసిన వాళ్లను మళ్లీ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నా. ఇవ్వాళ ఉన్న ప్రభుత్వానికి అసలు తెలంగాణ సోయి లేదు’’ అని Kavitha విమర్శించారు.
‘‘తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయటం మన గుండెల్ని మెలి పెట్టినట్లైంది. మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దాం. తెలంగాణలోని చాలా ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రాంతంలోని బిడ్డలకే 95 శాతం ఉద్యోగవకాశాలు రావాలని రాష్ట్రపతి ఉత్తర్వులను తెచ్చుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ప్రాంతేతరులకు ఉద్యోగాలు ఇస్తోంది. హర్యానా సహా పక్కరాష్ట్రాల వారికి తెలంగాణలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ అన్యాయాన్ని సహించేది లేదు. జాగృతి చూస్తూ ఊరుకోదు’’ అని హెచ్చరించారు.
‘‘ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే నా అభిమతం. మరోసారి అమరవీరులకు, వారి కుటుంబాలకు నా తరఫున క్షమాపణలు చెబుతున్నా. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. తెలంగాణ సోయి లేని ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని Kavitha పిలుపునిచ్చారు.
Read Also: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన రష్మిక

