కలం, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ (GHMC)లో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నాడని జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీలో అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడని కవిత వ్యాఖ్యానించారు. సీఎం తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతున్నారని చెప్పారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పనులన్నీ టెండర్ల ద్వారానే ఇవ్వాలి కానీ, టెండర్లు లేకుండానే జీహెచ్ఎంసీలో 1,148 కోట్ల పనులు అప్పగించారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న పనుల్లో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నారు. వెంటనే నామినేషన్ల పద్దతిని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్దతిలో టెండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించటం ఆపాలని, లేదంటే అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
రూ.50 కోట్లు దాటితే టెండర్ పిలవాల్సిందే
జీహెచ్ఎంసీ (GHMC) ఏర్పడిన తర్వాత కచ్చితంగా కొన్ని మంచి మార్పులు జరిగాయని కవిత అన్నారు. కానీ, ఇప్పటికీ చినుకుపడితే ఎక్కడి కార్లు అక్కడే నిలిచి పోయే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అంటూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 35 వేల కోట్ల రూపాయల ఫ్లాట్లను అమ్మారని తెలిపారు. కానీ, ఆ డబ్బులు మాత్రం హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పారు. హెచ్ఎండీఏలో ఒక ఆరు డిపార్ట్ మెంట్లు ప్రధానంగా ఉన్నాయని, వాటిల్లోనే విజిలెన్స్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఉన్నాయని చెప్పారు. ఏదైనా టెండర్ ఇవ్వాలంటే గ్రామాల్లో సైతం రూ.5 లక్షలు దాటితే టెండర్ రూపంలో ఇస్తామని, కానీ హెచ్ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున నామినేషన్ రూపంలో కాంట్రాక్టులు కట్టబెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాటి నుంచే ఈ పద్దతి కొనసాగుతోందని చెప్పారు. 2017 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా రూ.480 కోట్లను కాంట్రాక్టర్లకు ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రూ.1,148 కోట్లు పూర్తిగా నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ లు ఇచ్చారని చెప్పారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్‌కు పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. నామినేషన్ల పద్దతిలో కాంట్రాక్టులు ఇవ్వొవద్దని 2023లోనే కమిటీ స్పష్టం చేసిందన్నారు. అయినా ముఖ్యమంత్రి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఖండించారు. రూ.50 కోట్లు దాటితే కచ్చితంగా టెండర్ పిలవాల్సిందేనని స్పష్టం చేశారు. టెండర్లు పిలవటం కారణంగా మళ్లీ సగం వరకు ప్రభుత్వానికే ఆదాయం వస్తుందని చెప్పారు.
అవినీతి పెంచుకోవడానికే ఫ్యూచర్ సిటీ
హెచ్ఎండీఏకు (HMDA) ముఖ్యమంత్రే ఛైర్మన్, మున్సిపల్ మంత్రి వైస్ ఛైర్మన్ ఉన్నారని, ఖర్మ కొద్దీ ఈ ముఖ్యమంత్రే నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నామినేషన పద్దతిలో టెండర్లు పిలిచిన డిపార్ట్ మెంట్‌లో 6 వేల మంది పని చేస్తున్నారని, వారికి 23 వేలకు పైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే 13,500 లు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. నర్సరీ డిపార్ట్ మెంట్ లో మొక్కలు నాటటానికి, పెంచటానికి, పంచటానికి చేసిన అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ కు సంబంధించి ఒక కంపెనీపై సిట్ వేశారని, కానీ, ఆ సిట్ ఏమైందో తెలియదని చెప్పారు. సీఎంతో సిట్టింగ్ ద్వారా ఆ సిట్ మాయమైందా? అని ప్రశ్నించారు. అవుటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ కోసం మొత్తం ఖర్చు ప్రభుత్వం నుంచే పెడుతున్నారని కవిత (Kavitha) తెలిపారు. ప్రభుత్వం అవుటర్ మీద అవుతున్న ప్రమాదాల గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. అక్కడ ఉండాల్సినంత మంది లేబర్లను కూడా పెట్టటం లేదన్నారు.
సీఎం వద్ద సంచులు మోసే వ్యక్తి ఈ డిపార్ట్ మెంట్ కు వైస్ ఛైర్మన్ అన్నట్లు ఉన్నాడని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలను ఇప్పటికే హైడ్రా పేరుతో బెదిరించారని, స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయల చొప్పున వారి వద్ద వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరించడమనేది వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే అవినీతి బాగోతం చిట్టా మొత్తాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు ఇస్తామన్నారు. జీహెచ్ఎంసీ జరుగుతున్న అవినీతిని ఇంకా పెంచుకోవటానికి ఫ్యూచర్ సిటినీ ముందుకు పెడుతున్నారని, అది సరికాదని చెప్పారు. ముందు హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలని, అవినీతి కోసం హైదరాబాద్ సిటీ ఫ్యూచర్‌ను నాశనం చేయవద్దని డిమాండ్ చేశారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతులు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (Kaleshwaram Project) మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు కవిత తెలిపారు. కానీ, కాళేశ్వరాన్ని వాడుకొని కమీషన్ల కోసం కక్కుర్తి పడవద్దని హెచ్చరించారు. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టారని ఆరోపించారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుందని మాత్రం నమ్మటం లేదన్నారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతులకు ముందుకు వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు.
బీసీలపై వ్యతిరేకత చాటుకుంటున్న బీజేపీ
మహిళ బిల్లుకు మీద పాత సెన్సెస్ అప్లయ్ చేయాలని అనుకోవటం అన్యాయమని కవిత అన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికలతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల అవకాశాలు పోయాయన్నారు. 2027 జనాభా లెక్కల వరకు ఆగితే మహిళలకు సీట్లు పెరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈసారి జనాభా లెక్కల్లో బీసీల జనగణనన కూడా చేస్తామని చెప్పారని, దాని ద్వారా బీసీ మహిళలకు కూడా అవకాశాలు వస్తాయని భావించినట్లు చెప్పారు. కానీ, బీజేపీ అప్పటి వరకు ఆగకుండా బీసీల పట్ల తమకు ఉన్న వ్యతిరేకతను చాటుకుంటోందని విమర్శించారు. బీసీ బిడ్డలు, ఆడబిడ్డలు దీని మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 2027 తర్వాత మహిళ రిజర్వేష్లన్లు అమలు చేస్తే మంచి అవకాశాలు వస్తాయని కవిత (Kavitha) పేర్కొన్నారు. డ్రాఫ్ట్ బిల్లు గురించి స్టడీ చేస్తున్నామని, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని స్పష్టం చేశారు.
Read Also: నేపాల్ ప్రధాని సంచలనం.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ప్రజా క్షేత్రంలోకి!
Follow Us On: Instagram

