కలం, వెబ్ డెస్క్ : ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)ని వరుస వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. జనవరి 29న సమక్క-సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనలో శాంతిభద్రతలకు విఘాతం, రెచ్చగొట్టే వ్యాఖ్యల ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. తరువాత ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. తాజాగా ఈ కేసులో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన భార్య శాలినిరెడ్డి శనివారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా వేధించడానికి ఈ విచారణలు జరుపుతున్నారని కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఆరోపించారు. కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే భయపడేది లేదని చెప్పారు. తాను అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారన్న కౌశిక్ రెడ్డి.. తాను మత మార్పిడిలపై వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే ‘అసెంబ్లీ నక్సలైట్’గా మారతానని స్పష్టం చేశారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అప్పుడు కేసులు తిరగబడతాయని హెచ్చరించారు.
తన నియోజకవర్గంలో (Huzurabad) డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చెత్తనంతా తెచ్చి హుజూరాబాద్‌లో వేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికి విచారణ పేరుతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 7వ తేదీన హుజూరాబాద్‌లో దీక్షకు కూర్చొంటానని చెప్పారు.
Read Also: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుందా.. అయితే బీఅలర్ట్
Follow Us On: X(Twitter)

