కలం, మెదక్ బ్యూరో: ఎల్ నినో వల్ల వర్షాలు తగ్గి పశుగ్రాస కొరత, తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Pratima Singh) తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఎల్ నినో ప్రభావం పశువులపై పడకుండా చూసేందుకు రక్షణ చర్యలు, “భారత్ పశుధన్” యాప్ ఉపయోగం సంబంధిత అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం పశువులపై పడకుండా చూసేందుకు రక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున, ఉపాధి హామీ పథకం కింద ప్రైవేట్ భూముల్లో పశుగ్రాస సాగును ప్రోత్సహించాలన్నారు. ఎండుగడ్డి నిల్వలను ముందే సమకూర్చుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ (Pratima Singh) సూచించారు.
ఎండ తీవ్రతకు పశువులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజుకు 40 నుండి 60 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ప్రతిమా సింగ్ సూచించారు. నీటిఎద్దడి రాకుండా గ్రామ పంచాయతీల పరిధిలోని చిన్న నీటిపారుదల చెరువులను, కుంటలను గుర్తించి వాటిలో నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సమగ్ర పశు వైద్య సేవలే లక్ష్యంగా పనిచేయలని తెలిపారు. కరువు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పశుసంపదను కాపాడేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీల ద్వారా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

