కలం, వెబ్‌డెస్క్: గతేడాది ఇజ్రాయెల్ పర్యాటకురాలి (Israel Tourist Rape) తోపాటు మరో మహిళపై అత్యాచారం, వాళ్ల వెంట ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులకు మరణశిక్ష పడింది. ఈ మేరకు కర్ణాటకలోని కొప్పళ జిల్లా సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు వెల్లడించింది.
నిరుడు మార్చిలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మహిళ(27), అమెరికాకు చెందిన డేనియల్(23), నాసిక్‌కు చెందిన పంకజ్(43), ఒడిశాకు చెందిన డిబాస్ (42).. చారిత్రక పర్యాటక కేంద్రం హంపిని చూసేందుకు వచ్చారు. అక్కడికి సమీపంలోని ఆనెగొందిలో ఓ ఇంట్లో(హోం స్టే) బస చేశారు. మార్చి 6న సణాపురలోని తుంగభద్ర ఎడమ కాల్వ సమీపంలో ఓ మ్యూజిక్ షోకు ఈ నలుగురితో పాటు హోం స్టేకు చెందిన మహిళ వెళ్లారు.
అక్కడ వీళ్లు ఉండగా, మల్లేశ్ అలియాస్ హందిమల్ల, సాయి, శరణప్ప వచ్చి డబ్బు డిమాండ్ చేశారు. వాళ్లు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవ పడ్డారు. డేనియల్, పంకజ్, డిబాస్ను తుంగభద్ర కాల్వలోకి తోశారు. నీళ్లలో కొంతదూరం కొట్టుకుపోయిన తర్వాత డేనియల్, పంకజ్ ఎలాగోలా ఒడ్డుకు చేరారు. కానీ, డిబాస్ కొట్టుకుపోయి మృతి చెందాడు. ఒడ్డుకు చేరినవాళ్లు తిరిగి వచ్చేలోగా ఇజ్రాయెల్ మహిళ, హోం స్టే నిర్వాహకురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు (Israel Tourist Rape).
ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును త్వరగా తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసింది. నిందితులు నేరం చేసినట్లు రుజువు కావడంతో అత్యాచారం, హత్య కేసు ముగ్గురికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Read Also: నేను ఆశాజీవిని.. పరమశివుడు ఇస్తే ఆ పదవి తీసుకుంటా : మల్లారెడ్డి
Follow Us On: X(Twitter)


