కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) పట్టణంలో ఓ ఫ్లెక్సీ విషయంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. గురువారం ఉదయం సిద్దిపేట పరిధిలోని రంగాధంపల్లి వార్డు సభలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఫోటో లేదని బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం జరుగుతుండగానే ప్రజా పాలన ఫ్లెక్సీని చించివేసి ఆందోళన చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీల చింపివేతపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం, ప్రభుత్వం చేపట్టిన ఫ్లెక్సీలను కట్టడానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పూజాల హరికృష్ణ, టౌన్ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల ప్రయత్నించారు. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ నాయకులు వచ్చారన్న సమాచారంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శాంతి భద్రతల సమస్య రాకుండా క్యాంప్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

