కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు సాగు నీటి ప్రయోజనాలకు కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పడంతో జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మంత్రులు వాకిటి శ్రీహరి(Vakiti Srihari), జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు జరిపిన అత్యవసర చర్చలు సఫలం అయ్యాయి. ఆల్మట్టి డ్యాం నుంచి 30 రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం 7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకరించింది. దీంతో జూరాల కుడి, ఎడమ గేట్లను ఎత్తి రైతాంగానికి సాగునీటిని విడుదల చేస్తున్నారు.
ఇటీవల ప్రాజెక్టు కుడి, ఎడమల కాలువలకు అధికారులు సాగునీటిని నిలిపివేయడంతో అన్నదాతలు ఆగ్రహానికి గురయ్యారు. చేతికొచ్చిన పంటలను చేజిక్కించుకోవడానికి మరో మార్గం లేక ఆందోళనల బాట పట్టారు. జూరాల కుడి, ఎడమ కాలువల కింద సుమారు రెండు లక్షల పైగా ఎకరాల్లోని వరి పంటలను కాపాడుకోవాలని లక్ష్యంతో రైతాంగం పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిపక్షాలు తోడవడంతో ఉద్యమం బలంగా మారింది.
సీఎం అప్రమత్తమై..
తాగునీటి అవసరాల కోసమే జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడం లేదని ప్రాజెక్ట్ అధికారులు చెప్పడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై కర్ణాటకకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి బృందాన్ని పంపించారు. అంతకుముందే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ప్రభుత్వానికి ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని కిందికి విడుదల చేయాలంటూ లేఖలు పంపించారు. అంతలోనే జూరాల రైతంగం ఉద్యమం ఉధృతం చేయడంతో మంగళవారం మంత్రులు బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు.
పెరిగిన జూరాల మట్టం..
నాలుగు రోజులుగా కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం నాటికి 2,300 క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు రోజుల కిందట జూరాల ప్రాజెక్టులో 8.710 టీఎంసీలు ఉండగా, మంగళవారం నాటికి 9.029 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి నుంచి 15,500 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జూరాల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాలకు 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటిని వదలకుంటే స్పిల్ గేట్లు తెరవాల్సిన పరిస్థితి రానుండటంతో అధికారులు ఆగమేఘాల మీద కాలువలకు నీటిని విడుదల చేశారు.
రేపు మంత్రుల సమావేశం..
జూరాల ప్రాజెక్టు(Jurala Project)కు నీటి విడుదలకు అంగీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు మంత్రులు జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోనూ నీటి పరిస్థితి అనుకూలంగా లేకపోయినా తెలంగాణ రైతుల కోసం సహకరించడంపై మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ ఆయకట్టు రైతులు నీటిని ప్రణాళికాబద్ధంగా వాడుకోవాలని మంత్రులు పేర్కొన్నారు. రేపు మహబూబ్ నగర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

