భక్తిపారవశ్యంలో దేవరకొండ.. గణనాథుడి లడ్డూకు భారీ ధర

కలం, దేవరకొండ : దేవరకొండ (Devarakonda) పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ ఘనంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం వివిధ మండపాల వద్ద నిర్వహించిన వినాయకుడి ప్రసాదం (లడ్డూ) వేలం పాటలు భక్తుల పోటీతో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Balu Naik)ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా, లడ్డూ వేలంలో గెలుపొందిన విజేతలను అభినందించారు.

పట్టణంలోని 7వ వార్డు ఎంకేఆర్ నగర్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించిన వినాయకుడి వద్ద లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. ఈ వేలంలో తెల్దేవర్‌పల్లి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొద్దికూర మహాలక్ష్మయ్య – నాగమణి దంపతులు రూ. 1,25,116లకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ సదరు దంపతులకు శాలువాతో శుభాకాంక్షలు తెలిపి, వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మండపం వద్ద నిర్వహించిన పెద్ద లడ్డూ వేలం పాటలో 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర రూ. 50,116లు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇదే ప్రాంగణంలో చిన్న లడ్డూ కోసం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన రంగులాల్, రక్షితలను కూడా ఎమ్మెల్యే అభినందించారు.

మార్కెట్ యార్డ్ యూత్ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రత్యేకం

అనంతరం దేవరకొండ మార్కెట్ యార్డ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. “విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి.

వర్షాలు సమృద్ధిగా కురిసి మన రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆలంబోదరుడిని కోరుకున్నాను. ఐక్యత, సోదరభావంతో వేడుకలు నిర్వహిస్తున్న యువత, ఉత్సవ కమిటీల కృషి అభినందనీయం” అని కొనియాడారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మారుపాకుల సురేష్ గౌడ్, హనుమంతు వెంకటేష్ గౌడ్, హనుమంతు సాయి చంద్ర గౌడ్, కిన్నెర హరికృష్ణ, సోమాని నాయక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>