కలం, స్పోర్ట్స్: చైనాతో పోరులో భారత్ (India vs China) కు నిరాశ ఎదురైంది. ఐచి-నగోయా ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ సెమీఫైనల్లో భారత్ 1-3తో చైనా చేతిలో ఓడింది. దీంతో భారత జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లోనే చైనా ఆధిక్యంలోకి వెళ్లింది. షి యు కీ.. లక్ష్యసేన్‌ను వరుస గేముల్లో ఓడించాడు. ఆ తర్వాత సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చింది. లియాంగ్ వెయికెంగ్, వాంగ్ చాంగ్‌పై 21-11, 22-20తో విజయం సాధించింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది.
మూడో మ్యాచ్‌లో చైనా మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. లీ షిఫెంగ్.. ఆయుష్ శెట్టిని 21-19, 21-13తో ఓడించాడు. దీంతో చైనా 2-1తో ముందంజ వేసింది. భారత్‌కు మ్యాచ్‌లో నిలవాలంటే నాలుగో మ్యాచ్ గెలవాల్సి వచ్చింది. కానీ హరిహరన్ అమ్సకరుణన్, ఎంఆర్ అర్జున్ జోడీ ఓడిపోయింది. తొలి గేమ్‌ను 21-16తో కోల్పోయిన భారత జోడీ.. రెండో గేమ్‌ను 21-17తో గెలిచి పోరాటం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చైనా జోడీ 21-9తో పైచేయి సాధించింది. దీంతో చైనా 3-1తో మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరింది.
అయినా భారత పురుషుల జట్టుకు ఇది కీలక ఫలితమే. 1982, 1986 తర్వాత ఆసియా క్రీడల పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్‌కు ఇది రెండో పతకం. అంతేకాదు, వరుసగా రెండు ఆసియా క్రీడల్లో టీమ్ పతకాలు సాధించడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
Also Read : భారీ వర్షం.. పెచ్చులు ఊడిన చార్మినార్!
Follow Us On : WhatsApp

