కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) విభాగంలో “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గింపు (Single-Use Plastic Reduction Project ), స్థానిక సమాజంలో పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం” అనే అంశంపై ప్రత్యేక అప్రెంటిస్‌షిప్ ప్రాజెక్టును ముత్యం వివేక్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, SBM(G) జిల్లా IEC-HRD కన్సల్టెంట్ తిప్పర్తి రమేశ్ మార్గదర్శకత్వంలో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ కప్పులు, స్ట్రాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకేజింగ్ వస్తువులు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల కాలుష్యం, కాలువల మూసివేత, నీటి వనరుల కాలుష్యం, పశువులు, వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నాయని అధ్యయనంలో వివరించారు.
అవగాహన కార్యక్రమంలో భాగంగా వస్త్ర సంచులు, జూట్ బ్యాగులు, స్టీల్ బాటిళ్లు, పునర్వినియోగ పాత్రలు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యర్థాల సరైన నిర్వహణ, రీసైక్లింగ్, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గింపు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన నీరు, మంచి ఆరోగ్యం, స్థిరమైన సమాజాలు, వాతావరణ పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ లక్ష్యాల సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా DRDA అధికారులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ప్రజల్లో సుస్థిర జీవన విధానాలపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని తెలిపారు. అలాగే మహిళా సంఘాల ద్వారా వస్త్ర మరియు జూట్ బ్యాగుల తయారీకి ప్రోత్సాహం కల్పించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గీత, రమేశ్, ముత్యం శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

