కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ (Khammam Congress)లో కార్చిచ్చు ముదురుతోంది. అందులో భాగంగానే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ముగిసి రెండు వారాలు కావస్తున్నప్పటికీ, ఇంకా తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నాళ్లో నుంచో వేచిన పదవుల పంపకం కాస్తా, పార్టీలో దీర్ఘకాలంగా నడుస్తున్న వర్గపోరును ఒక్కసారిగా వీధికెక్కించింది. ఖమ్మం స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) ఛైర్మన్ పదవి ప్రకటనతో మొదలైన ఈ వివాదం, అంతటితో ఆగకుండా ఖమ్మం జిల్లాను దాటి హైదరాబాద్ గాంధీభవన్ కు చేరింది. తాజాగా గాంధీ భవన్ ను కూడా దాటుకుని మీడియా వేదికగా రచ్చకెక్కడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఒక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జిల్లా కాంగ్రెస్ వర్గ పోరును బహిర్గతం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌కు సుడా ఛైర్మన్ పదవిని కేటాయించడంపై ఆమె అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. “హూ ఇజ్ థట్ ఫెలో పువ్వాళ్ల దుర్గాప్రసాద్? ఒక వ్యక్తికి చెప్పులు, సంచులు మోసిన అతనికి సుడా ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారు? అసలు అతనికి ఉన్న అర్హత ఏంటి?” అంటూ రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు పదిహేనేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉన్న నాయుడు సత్యనారాయణకు స్టేట్ ఛైర్మన్ పదవి ఏ ప్రాతిపదికన ఇచ్చారని ఆమె అధిష్టానాన్ని నిలదీశారు. పదవులన్నీ భట్టి వర్గానికే, అందులోనూ వైరా నియోజకవర్గానికే దక్కాయంటూ ఆమె బలంగా వాదిస్తున్నారు. ఒకే వర్గానికి మూడు స్టేట్ ఛైర్మన్ పదవులతో పాటు సుడా ఛైర్మన్ పదవి ఇవ్వడం ఏంటని, పార్టీ కోసం రక్తం చిందించి కష్టకాలంలో జెండా మోసిన నమ్మకస్తులైన నాయకులను, సామాన్య కార్యకర్తలను పక్కనబెట్టి అర్హత లేని వారికి పదవులు ఎలా ఇస్తారంటూ తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కారు.
ఈ నామినేటెడ్ పదవుల మంటలు కేవలం ఖమ్మం నగరానికే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా వ్యాపించాయి. అక్కడ కూడా పాత కాంగ్రెస్ నాయకులను గుర్తించడం లేదని, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. “ద్రోహులకు పదవులు ఇస్తే పార్టీని అమ్ముకుంటారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత అలజడిని మరింత బట్టబయలు చేశాయి.
త్వరలోనే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రేణుకా చౌదరి వ్యవహార శైలి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రాజ్యసభ ఎంపీ స్థాయి వ్యక్తి సొంత పార్టీ నిర్ణయాలపై, తోటి నాయకులపై ఈ స్థాయిలో విరుచుకుపడటం పార్టీ శ్రేణులను విస్తుపోయేలా చేసింది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉండటమే కాకుండా, ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు బలమైన రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది.
ఖమ్మం జిల్లాపై తన పట్టును కోల్పోకూడదనే వ్యూహంతోనే రేణుకా చౌదరి ఇంతలా తెగించి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘాటు వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క వర్గం లేదా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం అధిష్టానం వద్దకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో, రానున్న రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

