కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది టాస్క్‌ఫోర్స్ పోలీస్ విభాగం (Karimnagar Task Force). కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న ఈ విభాగం, ఇప్పుడు మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో అక్రమ వ్యాపారాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం అక్రమ తరలింపు, గంజాయి విక్రయాలు, కల్తీ ఆహార పదార్థాల తయారీ లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వరుస దాడులు నిర్వహిస్తూ అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది.
ఇటీవలి కాలంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన కొంతమంది సిబ్బందిపై అక్రమ వ్యవహారాల ఆరోపణలు రావడంతో విభాగం ప్రతిష్ట మసకబారింది. పరిస్థితి తీవ్రమవడంతో ఒకేసారి సిబ్బందిని వివిధ విభాగాలకు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆరోపణలతో దెబ్బతిన్న ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకుంటూ ఈ విభాగం ఇప్పుడు మళ్లీ చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ప్రక్షాళన చేసి మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయాలనే నిర్ణయం సత్పలితాలిస్తోంది. ప్రస్తుతం ఈ విభాగంలో ఒక ఏసీపీ, ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందం కొత్త దిశానిర్దేశంతో దూసుకుపోతోంది.
ఇటీవలే వరుస దాడులు..
ఈ నెల 9న కరీంనగర్ మార్కెట్ పరిధిలో కల్తీ కారం పొడి విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 50 బస్తాల కారంపొడి, పసుపు, ధనియాల పొడిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో దాడి చేసి, ఏకంగా 150 ట్రాక్టర్ల అక్రమ ఇసుక దంపులను సీజ్ చేసి జమ్మికుంట పోలీసులకు అప్పగించారు. మానకొండూర్ మండలంలోని వెల్ది గ్రామంలో 6 ఇసుక క డంపులు , 2 ట్రాక్టర్లు సీజ్ చేసి 56కు పైగా ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు. కొత్తపెల్లి మండలంలో రెండు వేర్వేరు చోట్ల బారీ అక్రమ సుక డంపులు , 80కి పైగా ట్రాక్టర్ల లోడుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ నగరంలో గంజాయి విక్రయిస్తూ సేవిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వావిలాలపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న నమ్మదగిన సమాచారంతో 22 గంజాయి ప్యాకెట్లు, 4 గంజాయి చాక్లెట్లు, ఒక పల్సర్, బైక్, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కొత్తపల్లి మండలంలోని రాములపల్లిలో 50 ట్రాక్టర్ల దంపును, శాంతినగర్‌లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో మరో 30 ట్రాక్టర్ల ఇసుక దంపులను టాస్క్‌ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. కొత్తపల్లి మండలంలో ని నాగుల మల్యాల గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. 30 ట్రాక్టర్ల లోడును స్వాధీనం చేసుకుని కొత్తపెల్లి స్టేషన్ కు తరలించారు.
కమిషనర్ హెచ్చరిక
ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ వ్యాపారాలపై, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో మళ్లీ విశ్వాసం సంపాదించే ప్రయత్నం చేస్తోంది టాస్క్‌ఫోర్స్. నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే ప్రత్యేక యూనిట్‌గా దీనిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. అక్రమ దందాలు చేస్తే టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ గౌస్ ఆలం గట్టిగా హెచ్చరించారు.

