కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు (Munugodu) మండలంలో విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. పలివెల గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్.జె. మానసను సస్పెండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే ఆమెపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పలివెల గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణలో కార్యదర్శి మానస తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. అంతటితో ఆగకుండా, ఆమె నకిలీ రసీదు పుస్తకాలను సృష్టించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిరూపితమైంది.
నిబంధనల ప్రకారం.. ఇళ్లకే పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, నిబంధనలను తుంగలో తొక్కి ఖాళీ స్థలాలకు సైతం హౌస్ ట్యాక్స్ వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. విధుల నిర్వహణలో తీవ్ర నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో జిల్లా కలెక్టర్ ఈ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అక్రమాలపై కేవలం సస్పెన్షన్‌తోనే సరిపెట్టకుండా శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినా, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని అధికారులు హెచ్చరించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఇతరులపైనా కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

