కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ కరీంనగర్ లో (Karimnagar) ఎల్లప్పుడూ సహకరించుకుంటాయనేది నిన్నటి మున్సిపల్ కార్పొరేషన్ కో–ఆప్షన్ ఎన్నికతో మరొకసారి రుజువైందని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడుతూ.. డంప్ యార్డు సమస్యపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు బాధ్యత లేదా.. అని ప్రశ్నించారు. సంవత్సరం క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తీసుకువచ్చి, డంప్ యార్డు ఇతర సమస్యలకు సర్వరోగ నివారిణిని తీసుకొచ్చానంటూ హడావిడి చేశారని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ పనులకు అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అన్ని పనులు జరిగిపోయినట్టు భ్రమలు కల్పించారని విమర్శించారు. ఇప్పుడేమో బాధ్యత లేకుండా.. కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు జంతువుల కళేబరాలు వేస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్..
డంప్ యార్డు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఒక్కటై హుజురాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా, విన్యాసాలు ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా బండి సంజయ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మాని కేంద్రం ద్వారా ఏవిధమైన సహకారం లభిస్తుందో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండి తాజ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, నాయకులు దండి రవీందర్, ఇట్టెపు వేణు, మ్యాకల నర్సయ్య, జీడి రమేష్, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్ హనీఫ్, ఉప్పరి అజయ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

