కలం, కరీంనగర్ బ్యూరో : ఎల్‌ఎండీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడికి కరీంనగర్ (Karimnagar) ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్. శివకుమార్ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎల్‌ఎండీ కాలనీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నిందితుడు అసోడ అఖిల్ (21), పోరండ్ల గ్రామం, తిమ్మాపూర్ మండలంకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇతర నిందితులు ఏ-2, ఏ-3లను నిర్దోషిలుగా ప్రకటించింది. 2022 జనవరి 2న మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఎడెళ్లి వరలక్ష్మి (19) అదృశ్యమైనట్లు ఆమె దత్తత తల్లి బోయిని రాజమ్మ ఫిర్యాదు చేయడంతో మహిళ అదృశ్యం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో నిందితుడు అఖిల్‌తో యువతికి ప్రేమ సంబంధం ఉన్నట్లు, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు గుర్తించారు. అదే రోజు దేవునిగుట్ట కొండ ప్రాంతానికి తీసుకెళ్లిన అఖిల్, వివాహ విషయమై తలెత్తిన వివాదంతో ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే వదిలివేసి, ఆధారాలు నాశనం చేసేందుకు మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకొని మృతదేహం, ఇతర ఆధారాలను చూపించాడు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు గొంతు బిగించడం వల్లే మరణం సంభవించినట్లు నిర్ధారించాయి.
దర్యాప్తు అనంతరం నిందితుడు అఖిల్‌తో పాటు తల్లిదండ్రులపై అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కోర్టులో గల పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిందితులకు శిక్షలుపడేలా కృషి చేస్తున్న సీసీఆర్బి ఏసీపీ శ్రీనివాస్ జి, ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి తిమ్మాపూర్ సీఐ కె. శశిధర్ రెడ్డి, ప్రస్తుత ఎల్‌ఎండీ కాలనీ ఎస్‌హెచ్‌వో ఎస్.డి. అన్వర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. ప్రతాప్, సీడీవో ఎం. శంకర్ (హెచ్‌సీ), సీఎంఎస్ ఏఎస్సై ఎం.సత్తయ్య లను పోలీసు కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

