కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (kamareddy) జిల్లాలో ఆపరేషన్ కవచ్ లో భాగంగా గాంధారి పోలీసులు కీలక కేసును ఛేదించారు. అటవీ జంతువులను వేటాడుతున్న ఎనిమిది మంది ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు..
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 24 రాత్రి గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్ఐ మహేందర్, సిబ్బంది ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా వాహన తనిఖీలు చేస్తుండగా, రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనుదిరిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తనిఖీల్లో వారి వద్ద 5 నాటు తుపాకులు, గన్ పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్ వంటి వేట సామగ్రి లాభమైంది. మోటర్ సైకిళ్లను సీజ్ చేశారు.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి ఎస్ఐలు, సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విచారణలో నిందితులు అడవి జంతువుల వేటకు నాటు తుపాకులు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. వర్షం కారణంగా వేటకు వెళ్లకుండా వెనుతిరుగుతూ పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. మూడు నెలల క్రితం ఆంగోత్ ధర్మ నాయక్, సలావత్ చందర్ మధ్యవర్తిత్వంలో బాన్సువాడ మండలం చిన్నరాంపూర్కు చెందిన అస్లాం చావుస్ వద్ద ఒక్కో నాటు తుపాకిని రూ.10,000 చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. ట్రిగ్గర్ మెకానిజంలు లేని 3 తుపాకులను గండివేట్ తండా సమీపంలోని పొలంలో దాచినట్లు చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బాన్సువాడ మండలం చిన్నరాంపూర్ సమీపంలోని కోళ్ల ఫారంలో ఉన్న సలావత్ చందర్ (A-6), ఆంగోత్ ధర్మ నాయక్ (A-7), ప్రధాన సరఫరాదారు అస్లాం చావుస్ (A-8)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3 చాప్స్, 1 ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్ మెకానిజంలు, స్టీల్ పెలెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందికి రివార్డులు
కేసును సమర్థవంతంగా ఛేదించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్, సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డ్ వీరప్రసాద్లను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించి నగదు బహుమతులు అందజేశారు.
‘నేరస్థులకు సింహస్వప్నం ఆపరేషన్ కవచ్’ : ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు తావులేదని హెచ్చరించారు.”నేరస్థులకు సింహస్వప్నం, ప్రజలకు రక్షణ భరోసా ఆపరేషన్ కవచ్” అన్నారు. నిరంతర నిఘాతో చట్టవ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజల భద్రతే మా లక్ష్యమని స్పష్టం చేశారు.

