కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కరీంనగర్ జిల్లా పోలీసు శాఖ (Karimnagar Police) ఆధ్వర్యంలో బుధవారం మూడవ రోజు ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, రవాణా శాఖల సమన్వయంతో స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ చౌరస్తాలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. కేవలం నగరం పరిధిలోనే కాకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాల విద్యార్థులకు ఈ ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు వివరించారు. విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించి, వారిని సురక్షితంగా ప్రయాణించేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, రాంచందర్ రావు, తిరుమల్, సంజీవ్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

