కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) సిటీలో ఇటీవల పీఎంజే (PMJ) జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీ ఉదంతాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలునందు పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేసి, నిఘా (రెక్కి) నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని తెలిపారు.
హోటళ్లు, లాడ్జీలకు ముఖ్య సూచనలు:
ఖచ్చితమైన గుర్తింపు నిరూపణ (Mandatory Verification):
హోటల్ లేదా లాడ్జీలలో రూములు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం ఆధార్ కార్డులను గుడ్డిగా నమ్మకుండా.. అందులోని ఫోటో, వయస్సు, చిరునామా అసలైనవా కాదా అని సరిచూసుకోవాలి. అవసరమైతే అదనపు గుర్తింపు కార్డులను అడగాలన్నారు.
యాక్టివ్ మొబైల్ నంబర్ వెరిఫికేషన్:
కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్-చెక్ చేసుకోవాలి. అది సదరు వ్యక్తి పేరు మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. విదేశీయులు వస్తే నిబంధనల ప్రకారం తక్షణమే సమాచారం అందించాలి.
సీసీటీవీ నిఘా, రికార్డుల నిర్వహణ:
ప్రతి హోటల్‌లో హై-రెజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. కనీసం 90 రోజుల ఫుటేజీని భద్రపరచాలి. గెస్ట్ రిజిస్టర్, ఐడీ ప్రూఫ్స్, వాహనాల వివరాలు, చెక్-ఇన్/చెక్-అవుట్ సమయాలను డిజిటల్ రూపంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
అనుమానాస్పద కదలికలపై నిఘా:
లగేజీ లేకుండా రూమ్ తీసుకునేవారు, ఆయుధాలు లేదా అనుమానాస్పద బ్యాగులతో వచ్చేవారు, సీసీ కెమెరాల ముందుకు రాకుండా తప్పించుకునే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరవేయాలి.
చట్టపరమైన చర్యలు:
నిబంధనలు ఉల్లంఘించి, నిందితులకు ఆశ్రయం కల్పించినా లేదా పోలీసుల తనిఖీలకు సహకరించకపోయినా సదరు హోటల్ యాజమాన్యాలపై క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నగరంలో ముమ్మరంగా తనిఖీలు – నిఘా ఆపరేషన్లు
అంతర్రాష్ట్ర నేరగాళ్ల కదలికలను అణచివేయడానికి కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
సరిహద్దులు, వ్యూహాత్మక ప్రాంతాల్లో నాకా బందీ:
నగరంలోని ప్రధాన కూడళ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా ‘నాకా బందీ’ (వాహనాల తనిఖీ) నిర్వహిస్తున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లు, అద్దె వాహనాలు, తప్పుడు పత్రాలతో తిరిగే వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search):
సమస్యాత్మక ప్రాంతాలు, శివారు కాలనీలలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. కొత్తగా అద్దెకు దిగిన వారు, అనుమానాస్పద వ్యక్తులు మరియు పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నామన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు:
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, జ్యువెలరీ షాపులు, ఫైనాన్స్ సంస్థల వద్ద బ్లూ కోల్ట్స్, టాస్క్‌ఫోర్స్ మరియు ప్రత్యేక పోలీస్ బలగాలతో నిరంతర పెట్రోలింగ్ పెంచడం జరిగిందన్నారు.
ప్రజలకు విజ్ఞప్తి..
మీ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నా, హఠాత్తుగా ఇళ్లు అద్దెకు తీసుకుని వింతగా ప్రవర్తిస్తున్నా, అనాథగా వాహనాలు వదిలేసి వెళ్లినా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్, స్థానిక హోటల్స్ మరియు లాడ్జి ల యజమానులు పాల్గొన్నారు.

