కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రయోగం చేయబోతున్నారా..? కేబినెట్ మీటింగ్‌ను యాదగిరిగుట్టలో (Yadagirigutta) నిర్వహించాలని ఫిక్సయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి సచివాలయ వర్గాలు. ఈ మేరకు జీఏడీ ఏర్పాట్లలో నిమగ్నమైందని తెలుస్తోంది. వాస్తవానికి ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అదే రోజు కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది మంత్రులు అక్కడకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో కేబినెట్ సమావేశం వాయిదా వేసి, 23న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.
గతంలో మేడారంలో..
గత జనవరి 18న మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. హైదరాబాద్ బయట మంత్రి వర్గ సమావేశం కావడం అదే తొలిసారి. ఇప్పుడు కూడా అదే కోవలో యాదగిరిగుట్టలో నిర్వహించి, సంప్రదాయాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని చర్చ జరుగుతోంది.

