కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో రూపుదిద్దుకున్న నూతన జి+2 సమగ్ర జిల్లా అధికారుల కార్యాలయాల (కలెక్టరేట్) (Karimnagar New Collectorate) సముదాయంలోకి పాలనా యంత్రాంగాన్ని తరలించే ప్రక్రియపై అయోమయం నెలకొంది. భవన నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నప్పటికీ లోపల వివిధ ప్రభుత్వ శాఖల కేటాయింపు, సర్దుబాటు (Allotment) వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో అధికారుల మధ్య తీవ్ర చర్చలు, సమీక్షలు సాగుతున్నాయి.
ఇంకా తేలని శాఖల కేటాయింపులు
నూతన భవనంలో ఏయే శాఖలకు ఎంత విస్తీర్ణం కేటాయించాలి? ఏ అధికారి ఛాంబర్ ఎక్కడ ఉండాలి? ఏ అంతస్తులో ఏ విభాగాలు కొలువుదీరాలనే (Department Allocation) దానిపై స్పష్టమైన తుది జాబితా ఖరారు కాలేదు. దీనికితోడు భవనంలో గదులకు వేయాల్సిన ‘రూమ్ నంబరింగ్’ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.
కార్యాలయాల నిర్వహణకు అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, కంప్యూటర్ ర్యాక్లు, ఫైళ్ల ర్యాక్ల వంటి మౌలిక ఫర్నిచర్ కూడా ఇంకా పూర్తిస్థాయిలో సమకూరలేదు. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాలనా మార్పిడి ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అంతస్తుల వారీగా తాత్కాలిక ప్రతిపాదనలు
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాధాన్యత ఆధారంగా శాఖలను కేటాయించేందుకు ఉన్నతాధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లో రోజువారీగా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్), రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆధార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మీ-సేవ విభాగాలు, మొదటి అంతస్తు లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డిఆర్ఓ, పరిపాలనా విభాగాలు, ప్రధాన కాన్ఫరెన్స్ హాల్, ముఖ్యమైన రికార్డు రూమ్లు, రెండవ అంతస్తు లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (DRDO), వ్యవసాయ, సహకార, దేవాదాయ, విద్య, సంక్షేమ శాఖలతో పాటు ఇతర అనుబంధ కార్యాలయాలను పరిశీలిస్తున్నారు.
ప్రజలకు తిప్పలు తప్పవా?
స్పష్టమైన ప్లానింగ్, రూమ్ నంబర్లు, ఫర్నిచర్ అమరిక లేకుండా హడావుడిగా కార్యాలయాలను తరలిస్తే నిత్యం వినతులు ఇవ్వడానికి వచ్చే సామాన్య ప్రజలకు తమ శాఖ ఎక్కడుందో వెతుక్కునే తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది సంఖ్య, రూమ్ల పరిమాణానికి అనుగుణంగా గదులు కేటాయించాల్సి ఉండటంతో శాఖాధిపతుల మధ్య అసంతృప్తులు రాకుండా చూసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
మరికొన్ని రోజుల్లో సర్దుబాటు చేస్తాం: అధికారులు
అయితే ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తూ సందిగ్ధతకు తెరదించే ప్రయత్నం చేశారు. ప్రారంభోత్సవం పూర్తయిన కొన్ని రోజుల్లోనే గదుల నంబరింగ్, ఫర్నిచర్ అమరికతో పాటు శాఖల సర్దుబాటు ప్రక్రియను పూర్తిస్థాయిలో కొలిక్కి తెస్తామని స్పష్టం చేశారు. అదంతా కలెక్టర్ నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పారు. ఏ శాఖ ఎక్కడుంటే ప్రజలకు సులువుగా అందుబాటులో ఉంటుందో ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటున్నామని, పారదర్శకంగా అలాట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి నూతన భవనం నుంచే ప్రజా సేవలను వేగవంతం చేస్తామని వెల్లడించారు.

