epaper
Tuesday, February 17, 2026
epaper

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ‘టగ్ ఆఫ్ వార్’.. పై చేయి ఎవరిది?

కలం, తెలంగాణ బ్యూరో : ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మరొకరు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. వీరిద్దరికీ కరీంనగర్ మేయర్ (Karimnagar Mayor) ఎన్నిక సవాలుగా మారింది. ఎక్కువమంది కార్పొరేటర్లను గెలిపించుకుని బండి సంజయ్ క్రెడిట్ కొట్టేశారు. కానీ మేయర్ ఎన్నికకు ఆ సంఖ్యా బలం సరిపోవడంలేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ అవుతాననే ధీమాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పోస్టు కాంగ్రెస్ వశం కావాలన్నది సీఎం పట్టుదల. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. రెండు పార్టీల మధ్య పోటీకంటే ఇద్దరు పొలిటీషియన్ల మధ్య వార్‌గా మారింది. మేయర్ ఎన్నిక ఈ ఇద్దరికీ సవాలుగా తయారైంది. రాజకీయంగా ఎవరిది పైచేయి అవుతుంది?.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?.. షెడ్యూలు ప్రకారం ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు తేలనున్నది. మేయర్ ఎవరైనా హీరోలు మాత్రం ఈ ఇద్దరు నేతల్లో ఎవరన్నది ఆసక్తికరం.

కమలం, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు :

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కరీంనగర్ మేయర్ (Karimnagar Mayor) పోస్టును కైవశం చేసుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్వతంత్ర అభ్యర్థులు సహా ఇతర పార్టీల కార్పొరేటర్లకు గాలం వేస్తున్నది. ఎక్కువ స్థానాలు గెల్చుకున్న తమ పార్టీ అభ్యర్థే మేయర్ కావాలన్నది బీజేపీ లక్ష్యం. తగినంత సంఖ్యబలం లేకపోవడంతో బీజేపీ కూడా కాంగ్రెస్ లాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నది. “రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కార్పొరేషన్‌ను కైవశం చేసుకోలేకపోతే ఎట్లా?.. ఆరు నూరైనా మనకే దక్కాలి.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి దక్కకూడదు..” అని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. “ఒక్క సీటు దగ్గర తేడా వచ్చి మేయర్ పోస్టును చేజార్చుకోవద్దు.. అన్ని పార్టీలకంటే ఎక్కువ డివిజన్లు గెల్చుకున్న మనమే మేయర్ పోస్టును దక్కించుకోవాలి..” ఇదీ బీజేపీ టార్గెట్.

ఇద్దరు నేతలకు ‘ఇజ్జత్ కా సవాల్’ :

ఏ ఎన్నికైనా స్వయంగా తానే పోటీ చేస్తున్నాననే భావనతో రంగంలోకి దిగుతానని, ప్రచారం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తరచూ చెప్తుంటారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానం జారిపోవద్దన్నది ఆయన ఉద్దేశం. రెండు రోజులు వరుసగా సమావేశాలు పెట్టి జిల్లా కాంగ్రెస్ నేతలతో చర్చించారు. అమలు చేయాల్సిన వ్యూహాన్ని వివరించారు. మేయర్ ఎన్నిక విషయంలో ఫలితం ఎలా ఉన్నా అది డైరెక్టుగా సీఎం రేవంత్‌రెడ్డి ఖాతాలోకే వస్తుంది. దీంతో సీఎం వ్యూహం ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారింది. 30 మంది కార్పొరేటర్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినందున కార్పొరేషన్‌ను వదులుకోరాదన్నది బండి సంజయ్ (Bandi Sanjay) లక్ష్యం. కేంద్ర మంత్రిగా ఉండి కూడా గెలిపించుకోలేకపోతే పొలిటికల్‌గా చాలా డ్యామేజ్ అవుతుందన్నది బీజేపీ వాదన. దీంతో మేయర్ ఎన్నిక ఈ ఇద్దరికీ ‘ఇజ్జత్ కా సవాల్’గా మారింది.

కార్పొరేషన్ మేయర్ లెక్కలివే.. :

మొత్తం 66 డివిజన్లున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 30 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, బీఆర్ఎస్ 9 చోట్ల, మజ్లిస్ 3 చోట్ల, ఫార్వర్డ్ బ్లాక్ రెండు చోట్ల గెలిచాయి. ఎనిమిది మంది స్వతంత్రులు ఉన్నారు. వీటికి తోడు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్నారు. వీరంతా మేయర్ ఎన్నికలో ఓటర్లు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 69 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 35. ఇండిపెండెంట్లలో ముగ్గురు బీజేపీలో చేరడంతో (మద్దతు) ఆ పార్టీ బలం 33కు చేరుకున్నది. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఎంపీ బండి సంజయ్‌తో కలిపి మొత్తం 34 మంది మద్దతు బీజేపీవైపు ఉన్నది. ఇంకా ఒకటి తక్కుతున్నది. మిగిలిన ఒక్క ఓటు ఆ పార్టీకి కీలకం. ఇక కాంగ్రెస్ తరఫున చూస్తే గెలిచిన 14 మందితో పాటు ముగ్గురు మజ్లిస్ సభ్యులు మద్దతు ఇస్తున్నారు. అయినా మరో 18 మంది సపోర్టుతో మేయర్ పోస్టు ఖాయమన్నది కాంగ్రెస్ వాదన.

బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతు కీలకం :

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు మేయర్ పోస్టుపై కన్నేసినా తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో బీఆర్ఎస్ తరఫున గెలిచిన తొమ్మిది మంది ఎటువైపు అనేది కీలకంగా మారింది. మేయర్ పోస్టు విషయంలో ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినా బీఆర్ఎస్ రాజకీయ విమర్శలను ఎదుర్కోక తప్పదు. ఏ వైఖరి తీసుకోవాలన్నది ఆ పార్టీకి సవాలుగా మారింది. బీజేపీకి మద్దతు ఇస్తే ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్లవుతుంది. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే బీజేపీ చేతికి అస్త్రం దొరికినట్లవుతుంది. బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నది. ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల విషయంలోనూ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది కూడా చర్చనీయాంశమే.

మేయర్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ :

కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Corporation) ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఖాతాలోకి వెళ్ళకూడదన్నది కాంగ్రెస్ లక్ష్యం. దీంతో ఇండిపెండెంట్ కార్పొరేటర్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రపోజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందనే అపవాదు రాదని, స్వతంత్ర అభ్యర్థిని బలపరిచామని చెప్పుకోడానికి మార్గం సుగమం అవుతుందన్నది బీఆర్ఎస్ లీడర్లతో కాంగ్రెస్ చేస్తున్న వాదన. ఈ ప్రతిపాదనకు బీజేపీ నుంచి పొలిటికల్ విమర్శ ఎదుర్కొనే అవకాశం ఉండదు. ఒకవేళ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోతే పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుందనే విమర్శ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం లభిస్తుంది. ఇదే ఫార్ములా స్వతంత్ర అభ్యర్థులకు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్లకు కూడా వర్తిస్తుంది. గంటగంటకూ వ్యూహాలు మారుతుండడంతో చివరి వరకూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పార్టీల్లో, గెలిచిన కార్పొరేటర్లలో నెలకొన్నది. మేయర్ (Karimnagar Mayor) ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ క్షణ క్షణం… టెన్షన్… టెన్షన్..

Read Also: ఫిబ్రవరి 22న తానా ప్రపంచ సాహిత్య వేదిక

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>