కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల (National Library Week) ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, TNGO యూనియన్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, TNGO జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, తెలంగాణ వ్యవస్థక అధ్యక్షులు ముదిగంటి సుధాకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. శశిజా దేవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.
దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలని, పుస్తకాలు మనిషి జీవితానికి దిశానిర్దేశం చేసే గొప్ప మార్గదర్శకాలని అన్నారు. పెద్దలు చెప్పినట్లుగా “చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో” అనే మాట పుస్తక పఠనం గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. పుస్తక పఠనం ద్వారా మనిషిలోని అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం పెంపొందుతుందని, అజ్ఞానంతోనే మనిషి మోసపోతాడని, విజ్ఞానవంతుడు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడని పేర్కొన్నారు. దొంగలు దోచుకోలేని సంపద విజ్ఞానమని, ఇతరులకు పంచిన కొద్దీ మరింత పెరిగేది జ్ఞానమని వివరించారు.
ప్రభుత్వ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే నిరంతర పుస్తక పఠనం ఎంతో అవసరమని, నేడు సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న మేధావులు, ప్రముఖులందరూ ఏదో ఒక దశలో గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకున్నవారేనని అన్నారు.
TNGO జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు మాట్లాడుతూ.. విద్యార్థులు టీవీలు, సినిమాలతో విలువైన సమయాన్ని వృథా చేయకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

