కలం, ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల (Velugumatla)లో కూల్చివేసిన ఇళ్ల బాధితులందరికీ ఎలాంటి నిబంధనలు, షరతులు పెట్టకుండా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. అర్హులైన మిగతా వారందరికీ వెలుగుమట్లలోనే ఇళ్లు కట్టిస్తామని స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా హామీ ఇచ్చారని, ఆయన తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన వెలుగుమట్లను సందర్శించారు. ఈ సందర్భంగా కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన కలెక్టర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బాధితులతో కలిసి నిరసన సభ నిర్వహించారు.
సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం 729 పేద కుటుంబాల ఇళ్లను కూల్చివేసి, కేవలం 300 మందికే ఇళ్లు నిర్మిస్తామనడం మరో కుట్ర అని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సంయుక్తంగా నిర్వహించిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా దిగివచ్చిన ప్రభుత్వం, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ద్వారా మిగతా వారికీ వెలుగుమట్లలోనే ఇళ్లు ఇస్తామని మాట ఇచ్చిందన్నారు.
స్వగ్రామాల్లో చిన్నపాటి ఇళ్ల స్థలాలు ఉన్నాయన్న సాకుతో బాధితులను అనర్హులుగా చూడరాదని, కూల్చిన ప్రతి ఇంటినీ నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. భూదాన భూములు కేవలం పేదలకే చెందాలని, వాటిలో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 29వ తేదీ లోపు ఏమాత్రం జాప్యం చేయకుండా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో 29న తలపెట్టిన రాహుల్ నివాస ముట్టడిని కొనసాగిస్తామని హెచ్చరించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పోడకంటి రాంబాబు మాట్లాడుతూ, 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు భూమిపై హక్కు కల్పించాల్సిన ప్రభుత్వం, వారి ఇళ్లను కూల్చి రాజ్యాంగాన్ని అవమానపరిచిందన్నారు. నివాసం ఉన్న బాధితుల ఇళ్లను కూల్చి, తిరిగి వారిని అనర్హులు అనడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులే నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి గుర్తించిన అర్హులందరికీ షరతులు లేకుండా వెలుగుమట్లలోనే ఇళ్లు కట్టించాలని, లేదంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మరో భారీ ఉద్యమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు.
ప్రముఖ న్యాయవాది వంజాకుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన తప్పును తక్షణమే సరిదిద్దుకోవాలని, లేనియెడల న్యాయస్థానం ద్వారా వారిని శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో-కన్వీనర్ రాజేష్, నాయకులు లక్ష్మి, నవ్య, కృష్ణ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

