కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు (Irrigation Projects) సంబంధించిన భూ సేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) భూ సేకరణ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనుల పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra), అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్, మానేరు రివర్ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనుల పురోగతిపై కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత మేర భూ సేకరణ పూర్తయింది? ఎంత పెండింగ్‌లో ఉంది? వివిధ అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం..
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు (Irrigation Projects) అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌తోపాటు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) వంటి అంశాలను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.
తక్షణమే పరిహారం ఇవ్వాలి..
భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసిత రైతులు, ప్రజలకు నిబంధనల ప్రకారం తక్షణమే పరిహారం అందించడంతో పాటు పునరావాస చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించి భూ సేకరణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక చర్యలు చేపట్టాం..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి జాప్యం జరగకుండా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ, భూ సేకరణ విభాగం ఇన్‌చార్జి ఎస్.డి.సి. స్వామి, ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: కదిలే రైలులో హనీమూన్.. నెట్టింట వీడియో వైరల్
Follow Us On: Instagram

