కలం, కరీంనగర్ బ్యూరో: ఆధునిక వైద్య రంగంలో అత్యంత సంక్లిష్టమైన అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించే ఆర్థోపెడిక్, ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ప్రదర్శనకు కరీంనగర్ (Karimnagar) వేదిక అయింది. ఇండియన్ ఆర్థోస్కోపిక్ సొసైటీ జాయింట్ ప్రెజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ ఆర్థోస్కోపిక్ సొసైటీ, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్, కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్లు సంయుక్తంగా రేనే హాస్పిటల్‌లో శస్త్ర చికిత్సల నిర్వహణలో భాగమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది ఆర్థోపెడిక్, ఆర్థోస్కోపిక్ సర్జన్లు, ఆర్థోపెడిక్ పీజీ వైద్య విద్యార్థులు దీనిలో పాలుపంచుకున్నారు. శస్త్ర చికిత్సలను లైవ్ టెలికాస్ట్ ద్వారా హోటల్ త్రిధలో నిర్వహించిన సీఎంఇ ప్రోగ్రాం ద్వారా ప్రదర్శించారు. డాక్టర్ సాయి వీర్ల, డాక్టర్ నితిన్ కుమార్ బెజ్జంకి, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ రమాకాంత్ రాజగోపాల్ కృష్ణన్, డాక్టర్ సుఖేష్ రావు లైవ్ సర్జన్లు నిర్వహించారు.
‘వైద్య విద్యార్థులకు మంచి అనుభవం..’
ఈ కార్యక్రమం నిర్వాహక ఛైర్మన్ డాక్టర్ బంగారు స్వామి (Dr. Bangaru Swamy) మాట్లాడుతూ.. తాము మెడిసిన్ చదివే రోజుల్లో ఇలాంటి సమావేశాలు కేవలం దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లోనే జరిగేవని గుర్తు చేసుకున్నారు. అలాంటిది, నేటి వైద్య విద్యార్థులకు కరీంనగర్ (Karimnagar) లాంటి జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సులు నిర్వహించడం మంచి అనుభవాన్ని పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి , తెలంగాణ ఆర్ట్రోస్కోపిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జై ప్రసాద్ పెద్ది, ఇండియన్ ఆర్ట్రోస్కోపిక్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ శ్రీధర్ గంగవరపు పాల్గొన్నారు. లైవ్ సర్జరీ కార్యక్రమానికి సహకరించిన మత్తు వైద్య నిపుణులు డాక్టర్ మునీష్, డాక్టర్ కృష్ణా రెడ్డి, ఆపరేషన్ థియేటర్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Also: వచ్చే 25 ఏండ్లు కాంగ్రెస్‌దే అధికారం: వేం నరేందర్ రెడ్డి
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

