గణేష్ నిమజ్జన నీటిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: బీజేపీ ఫైర్

కలం, ​కరీంనగర్: “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ పండుగల నిర్వహణ పట్ల అడుగడుగునా వివక్ష చూపుతోంది. కరీంనగర్ (Karimnagar) నగరంలో వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణేష్ నిమజ్జన ఉత్సవాలను సైతం సజావుగా సాగనీయకుండా ప్రభుత్వం, అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారు” అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నగరంలో నిర్వహించిన అత్యవసర విలేకరుల సమావేశంలో యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

“కరీంనగర్ నగరపాలక సంస్థ తరఫున, మేయర్, డిప్యూటీ మేయర్‌ల సంతకాలతో నగరంలోని 1000కి పైగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం (Ganesh Immersion) కోసం ఎస్ఆర్ఎస్‌పీ (SRSP) నీటిని చింతకుంట కెనాల్‌కు విడుదల చేయాలని ముందస్తుగానే అధికారులకు రాతపూర్వకంగా విన్నవించాము. అయినా ప్రభుత్వం నుండి కనీస స్పందన కరువైంది.” అని మండిపడ్డారు.”కరీంనగర్ పౌరుల భావోద్వేగాలను గౌరవిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి నీటిని విడుదల చేయాలని కోరారు.

అయినా స్థానిక ఇరిగేషన్ సీఈ (CE), ఈఎన్సీ (ENC) అధికారులు నీటి విడుదల ప్రసక్తే లేదని అహంకారపూరితంగా సమాధానం చెప్పడం ప్రభుత్వ అహంకారానికి, నిర్లక్ష్యానికి పరాకాష్ట.” అని దుయ్యబట్టారు. “గతంలో రిజర్వాయర్‌లో కేవలం 15 నుండి 16 టీఎంసీల నీరు ఉన్నప్పుడు కూడా ఎల్‌ఎంబీ (LMD)కి నీటిని విడుదల చేసిన చరిత్ర ఉంది. ఈరోజు జలాశయాల్లో సరిపడా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నీటిని వృథా కాకుండా చూసుకుంటూ నిమజ్జనానికి, ఇటు రైతుల పంట పొలాలకు నీరిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే నీటి విడుదలపై తాత్సారం చేసిందని పేర్కొన్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందూ పండుగలపై ఉన్న వివక్ష కాకపోతే మరేమిటి?” అని ప్రశ్నించారు. “మౌనంగా ఉంటే ప్రభుత్వం వినదని గ్రహించి, బీజేపీ ఆధ్వర్యంలో, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజా సంఘాలు, భక్తులతో కలిసి రాత్రికి రాత్రే సుదీర్ఘ పోరాటాలు, ఆందోళనలు చేపట్టాము. ప్రజాగ్రహానికి భయపడి, బీజేపీ చేసిన ఒత్తిడికి తలొగ్గి చివరకు ప్రభుత్వం నీటిని విడుదల చేయడానికి సిద్ధపడింది. ఇది ప్రజా పోరాటానికి లభించిన విజయం.” అని తెలిపారు.

“ఎన్నికల సమయంలో దేవుళ్ల పేర్లు చెప్పి ఓట్లు అడిగిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక హిందూ పండుగల నిర్వహణకు ఎలాంటి క్యాలెండర్, ముందస్తు ప్రణాళిక లేకుండా కంటితుడుపు చర్యలు చేపడుతోంది. ప్రతి హిందూ పండుగకు భక్తులను ఆందోళన బాట పట్టించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఈ అహంకార పూరిత విధానాలకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ​

“ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు చింతకుంట కెనాల్‌లో సరిపడా నీటి ప్రవాహాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి. ఏ ఒక్క విగ్రహ నిమజ్జనానికి నీటి కొరత వచ్చినా, ఉత్సవ నిర్వాహకులతో కలిసి బీజేపీ పార్టీ రాజీలేని ఆందోళన చేపడుతుంది.” అని హెచ్చరించారు. ​ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ బీజేపీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, ఉత్సవ మండపాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>