కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డును కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన, స్థానిక అధికారులు మరియు మార్కెట్ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, తహశీల్దార్ (ఎమ్మార్వో) వెంకట్ రెడ్డి, జమ్మికుంట టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, వెంకట్ లతో కలిసి ధాన్యం కొనుగోళ్ల తీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, ఇందుకోసం పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల (సివిల్ సప్లైస్) అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, కొనుగోళ్లు సజావుగా సాగేలా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, వెంకట్, ఇతర శాఖల అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

