Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంకుడు గుంతలు తప్పనిసరి.. ప్రభుత్వం కఠిన నిబంధనలు

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సిటీలో భూగర్భ జలాల పెంపు, భవిష్యత్తు నీటి అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త వ్యూహం కోసం ఆలోచిస్తున్నది. నీటి వృథాను అరికట్టేందుకు, వర్షపు నీటిని సంరక్షించేందుకు కఠిన నిర్ణయాలనే తీసుకోబోతున్నది. ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని భావిస్తున్నది. అవి ఏర్పాటు చేసుకోని ఇండ్లు, అపార్టుమెంట్లు జలమండలికి చెందిన వాటర్ ట్యాంకర్‌లను బుక్ చేసుకుంటే డబుల్ రేట్ వసూలు చేయాలని ఆలోచిస్తున్నది. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలు బాధ్యతాయుతంగా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, ఇందుకోసం ఇంకుడు గుంతల ఏర్పాటును ఒక ఉద్యమంలాగానే నిర్వహిస్తామన్నారు. దీనికోసం ప్రభుత్వం ఈసారి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తామన్నారు. వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా అదే ప్రాంతం నుంచి పదే పదే ట్యాంకర్లు బుక్ చేసుకుంటామంటే ఇకపై డబుల్ రేట్ విధిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రౌండ్ వాటర్ పెంచకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు.

హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్లపై కఠిన నిబంధనలు

నగరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలపైనా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో కనీస నీటి సామర్థ్యం ఉందో లేదో కూడా చూడకుండానే భారీ భవనాలకు, హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు పర్మిషన్లు ఇచ్చే విధానంపై మండిపడ్డారు. ఇకపై ఇలాంటి పొరపాట్లకు తావుండదని, హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చే ముందు అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ఆ ప్రాంతంలో తగినంత నీటి వనరుల లభ్యత ఉన్నదో లేదో పక్కాగా తేల్చిన తర్వాతే నిర్మాణ అనుమతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

సిటీ డ్రింకింగ్ వాటర్ సరఫరాపై సమీక్ష :

నగర తాగునీటి సరఫరా, జలమండలి ప్రగతిపై సంబంధిత అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా జరుగుతున్నదని మంత్రి మీడియాకు వివరించారు. నగర భవిష్యత్తు అవసరాల కోసం రూ. 7 వేల కోట్లతో గోదావరి ఫేజ్ 2, 3 పనులు జరుగుతున్నాయని, దీనికి తోడు కృష్ణా ఫేజ్ 4, 5తో పాటు సింగూరు వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టులను కూడా తీసుకువస్తామన్నారు. జలమండలి అభివృద్ధి, ప్రాజెక్టుల కోసం ఈ బడ్జెట్‌లో మొత్తం రూ. 11,900 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. నగరంలో మొత్తం 14.50 లక్షల ట్యాప్ కనెక్షన్లు ఉంటే అందులో 6.23 లక్షలు ఉచిత కనెక్షన్లేనని తెలిపారు. బస్తీలకు ప్రాధాన్యత ఇస్తూ నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎండకాలంలో డిమాండ్‌కు తగ్గట్టు ట్యాంకర్ల సరఫరా వేగంగా జరుగుతున్నదని, 95% ట్యాంకర్లు బుక్ చేసిన 24 గంటల్లోనే డెలివరీ అవుతున్నాయన్నారు. నగరంలో సుమారు 6 లక్షలకుపైగా ‘మ్యాన్ హోల్స్‌’ను క్లియర్ చేసే ప్రక్రియ ఏప్రిల్‌లోనే ప్రారంభమైందని, దాదాపు ముగింపు దశకు చేరుకున్నదన్నారు. డ్రైనేజ్ లైన్లపై అక్రమ నిర్మాణాలుంటే తొలగిస్తామన్నారు.

తాగునీటిపైనా బీఆర్ఎస్, బీజేపీ రాజకీయం :

గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నగర భవిష్యత్తు నీటి అవసరాలపై ఎలాంటి ప్లాన్ చేయలేదని, ఒక్క మిలియన్ గ్యాలన్ వాటర్ కూడా అదనంగా తీసుకురాలేకపోయిందని మంత్రి విమర్శించారు. ఇప్పుడు మాత్రం అధికారం కోల్పోయి విపక్షంగా ఉండడంతో ఉద్దేశపూర్వకంగానే జలమండలి ముందు ధర్నాలు చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. “నేనూ విపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేశాను.. కానీ నీటి లాంటి ప్రాణాధారమైన అంశంపై రాజకీయం చేయలేదు.. అలాంటివి ఇప్పుడు ప్రతిపక్షాలు చేయవద్దు” అని హితవు పలికారు. మంచి నీటిని మిస్ యూజ్ చేస్తే భారీ పెనాల్టీలు ఉంటాయన్నారు. జలమండలిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>