కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిరంతర సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీస్ అధికారులకు జిల్లా మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా సీపీ గౌష్ ఆలం (Karimnagar CP Gaush Alam) ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ చేసిన అధికారులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, సమాజ రక్షణలో పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని, తమ జీవితంలో అత్యధిక భాగాన్ని ప్రజల శాంతిభద్రతల కోసం కేటాయించి విజయవంతంగా పదవీ విరమణ సాధించడం అభినందనీయమని కొనియాడారు. విధినిర్వహణలో వారు చూపిన ప్రతిభ, క్రమశిక్షణ యువ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వు ఇన్స్పెక్టర్ కిరణ్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్సై మామిడి సురేందర్, ఇతర అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

