Mobile Popup Ad
Mobile Popup Ad

ఆహార భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : జిల్లాలోని ఆహార పదార్థాలు దుకాణదారులంతా ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆహార భద్రతపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయి దుకాణాలు, దాబాలు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. వంటల తయారీలో ఉపయోగించే నూనెలు, మసాలా దినుసులు, పాలు, పెరుగు తదితర ముడి పదార్థాలు నాణ్యమైనవే వినియోగించాలని అన్నారు. ఆహార భద్రత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, దుకాణాల లైసెన్సులు సరి చూడాలని పేర్కొన్నారు. ముడి పదార్థాల గడువు తేదీలను, లేబుళ్లను ఎప్పటికప్పుడు చూడాలన్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించినా, ఫుడ్ కలర్లను వాడినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, మాంసం వంటి ఆహార పదార్థాలు తాజావే వాడుతున్నారో లేదో చూడాలని చెప్పారు. అపరిశుభ్రమైన, గడువు ముగిసిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించినా, దుకాణాల్లో నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు అమలవుతున్నాయో లేదో నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం, ఇటీవల ఫుడ్ సేఫ్టీ అంశం మీద శిక్షణ పొందిన పలువురు అంగన్వాడి టీచర్లకు కలెక్టర్, అధికారులు సర్టిఫికెట్లను అందించారు. ఈ సమావేశంలో జిల్లా ఆహార భద్రత అధికారి సునీత, వైద్యారోగ్య అధికారి రాజేందర్, డిడబ్ల్యూవో వినూత్న, డిపివో శ్రీనివాస్, డిఈఓ భోజన్న, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>