కలం, కరీంనగర్ : ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ లక్ష్యంగా నవంబర్ 1న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ‘ఛలో ఢిల్లీ–ఓట్ బచావో, దేశ్ బచావో’ (Vote Bachao Desh Bachao) కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు (Karimnagar Congress Team) బయలుదేరారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమానికి మద్దతుగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుమారు 40 మందితో కూడిన బృందం బస్సులో ఢిల్లీకి పయనమైంది.
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వైద్యుల అంజన్ కుమార్ పార్టీ జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి కరీంనగర్ కాంగ్రెస్ తరఫున సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన స్ఫూర్తితో, నేడు ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత పోరాటాన్ని కూడా అదే తరహాలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ‘జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్’ నినాదంతో ఓటు హక్కు స్వేచ్ఛ కోసం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అన్నారు.
ఢిల్లీకి బయలుదేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ అలీ, నాత శ్రీనివాస్, షాబాజ్ ఖాన్, షేక్ అజీముద్దీన్, యాకూబ్ పాషా, ఎండీ ఇమ్రాన్, ధ్యావ శ్రీనివాసరెడ్డి, మర్రి ఓదెలు యాదవ్, పంజాల స్వామి గౌడ్, కామ్రెడ్డి రాంరెడ్డి, సాయిని తిరుపతి, మూల జైపాల్, కుంభాల రాజ్‌కుమార్, కోటోజు అశోక్, రాజేష్, శ్రీకాంత్, అరవింద్, మంద మహేష్, జి. కిరణ్ రెడ్డి, బి. ఉమాపతిరావు, వాసాల శ్రీనివాస్, కొల్లూరి కిరణ్, ఎంఏ ముజీబ్ అయూబ్ తదితరులు ఉన్నారు.

