కలం, తిమ్మాపూర్: ధాన్యం కొనుగోళ్లలో పూర్తి పారదర్శకతను పాటించడంతో పాటు అక్రమాలకు తావులేకుండా చేసేందుకే కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) తెలిపారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Centre) ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్కు అడ్డుకట్ట వేసి, రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు చేరువలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల్లో కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, నుస్తులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రవి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గోదారి తిరుపతి, నాయకులు గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, కొత్త తిరుపతిరెడ్డి, బుధారపు శ్రీనివాస్, తమ్మనవేణి రాములు యాదవ్, ఎలుక రాజు, రెడ్డిగాని రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సిరిగినేనికి కవ్వంపల్లి నివాళి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి అక్కడే గుండెపోటుతో మృతి చెందిన తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన సిరిగినేని చిన్న కొండల్ రావు కుటుంబ సభ్యులను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి నుస్తులాపూర్ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే.. చిన్న కొండల్ రావు భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, నుస్తులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పొన్నాల చిరంజీవి, నాయకులు పెద్ద కొండల్ రావు, కొత్త తిరుపతిరెడ్డి, బుధారపు శ్రీనివాస్, పోలు రాము, రమేశ్ తదితరులు ఉన్నారు.

